

ఈసారి సంక్రాంతికి విడుదల కానున్న సినిమాలు దాదాపుగా ఖరారైపోయాయి. ఇప్పటికే ఐదు చిత్రాలు రిలీజ్‌ను ఫిక్స్ చేసుకున్నాయి. పైగా ఇతర భాషల నుంచి మరో రెండు చిత్రాలు కూడా జాబితాలో చేరాయి. అంటే పండగలో సినిమాల వర్షమే అని చెప్పొచ్చు. ‘సంక్రాంతి అంటే సినిమాల పండగ’ అన్న మాటను బాక్సాఫీస్ మరోసారి రుజువు చేయబోతోంది. ఈసారి థియేటర్లలో నవ్వుల పంట పండించేలా అన్ని సినిమాలు కితకితలు పెట్టే ఎంటర్టైన్మెంట్తో వస్తున్నాయి.
‘మన శంకరవరప్రసాద్‌గారు’, ‘ది రాజాసాబ్’, ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’, ‘అనగనగా ఒక రాజు’, ‘నారీ నారీ నడుమ మురారి’ వంటి అన్ని చిత్రాలూ పండగ వాతావరణానికి తగ్గట్టు కుటుంబ వినోదంతో ముస్తాబవుతున్నాయి. రవితేజ, నవీన్ పొలిశెట్టి హీరోలుగా వస్తున్న సినిమాలు ఇప్పటికే ప్రచార చిత్రాలు, పాటలతో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్నాయి. కిశోర్ తిరుమల దర్శకత్వంలో వస్తున్న ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ హాస్యంతో నిండిన ఫ్యామిలీ ఎంటర్టైనర్గా కనిపిస్తోంది. నవీన్ పొలిశెట్టి నటిస్తున్న ‘అనగనగా ఒక రాజు’ జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే శర్వానంద్ నటిస్తున్న ‘నారీ నారీ నడుమ మురారి’ కూడా సంక్రాంతి రేసులో ఉంది.
సంక్రాంతి హీరోలతో పాటు సంక్రాంతి దర్శకులు కూడా తమదైన మార్క్ చూపిస్తున్నారు. గత ఏడాది ‘సంక్రాంతికి వస్తున్నాం’తో నవ్వులు పూయించిన అనిల్ రావిపూడి, ఈసారి చిరంజీవితో ‘మన శంకరవరప్రసాద్‌గారు’ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇందులో వెంకటేశ్ కీలక పాత్రలో కనిపించనున్నారు. అదేవిధంగా హారర్ కామెడీ కథలలో నైపుణ్యం ఉన్న మారుతి, ప్రభాస్ హీరోగా పాన్ ఇండియా స్థాయిలో ‘ది రాజాసాబ్’ చిత్రాన్ని తెరకెక్కించారు. తాత–మనవడు నేపథ్యంతో, హవేలీ ప్యాలెస్‌లో సాగే హారర్ కామెడీగా వస్తున్న ఈ చిత్రం జనవరి 9న విడుదల కానుంది. భారీ అంచనాలు పెంచుకున్న ఈ సంక్రాంతి చిత్రాలు బాక్సాఫీస్‌ను ఉర్రూతలూగించడానికి సిద్ధంగా ఉన్నాయి.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!