

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా, దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న ‘స్పిరిట్’ సినిమా ప్రస్తుతం అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌లలో ఒకటిగా నిలిచింది. షూటింగ్ దశలోనే ఈ సినిమాపై భారీ స్థాయిలో చర్చ జరుగుతోంది. ప్రతి చిన్న అప్డేట్ అభిమానుల్లో ఉత్సాహాన్ని పెంచుతోంది. తాజాగా సీనియర్ నటి నదియా చిత్రబృందంలో చేరడం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ప్రత్యేక ఆకర్షణగా మారింది.
గతంలో ‘మిర్చి’ సినిమాలో ప్రభాస్‌కు తల్లిగా నటించి మెప్పించిన నదియా, దాదాపు 14 సంవత్సరాల తర్వాత మరోసారి ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతున్న షెడ్యూల్లో ఆమె పాల్గొన్నట్లు సమాచారం. ఆమె పాత్ర వివరాలు గోప్యంగా ఉంచినప్పటికీ కథలో కీలక పాత్రగా ఉండబోతుందని సినీ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు వివేక్ ఒబెరాయ్ ప్రతినాయకుడిగా, తృప్తి దిమ్రి కథానాయికగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్నారు. భారీ నిర్మాణ విలువలతో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే ఉన్న అంచనాలను నదియా ఎంట్రీ మరింత పెంచింది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!