

మెగాస్టార్ చిరంజీవి , సంక్రాంతి బ్లాక్బస్టర్ మన శంకర వర ప్రసాద్ గారు చిత్రానికి తెలుగు ప్రేక్షకులు అందించిన అపూర్వ ఆదరణకు కృతజ్ఞతలు తెలిపారు. దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ చిత్రంలో నయనతార కథానాయికగా నటించగా, విక్టరీ వెంకటేష్ కీలక పాత్రలో మెప్పించారు. షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 12న విడుదలై రికార్డు స్థాయి కలెక్షన్లతో దూసుకుపోతోంది.
ఈ ఘన విజయం సందర్భంగా నిర్వహించిన ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ సెలబ్రేషన్ కార్యక్రమంలో సినిమా యూనిట్, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లకు షీల్డ్స్ అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన చిరంజీవి, “ఇంత గొప్ప విజయం ఇచ్చి నా గత వైభవాన్ని మళ్లీ పునరావృతం చేసిన తెలుగు ప్రేక్షకులందరికీ శిరస్సు వంచి ధన్యవాదాలు” అని అన్నారు. షూటింగ్ సమయంలో టీమ్ అంతా కుటుంబంలా కలిసి పనిచేశామని, అలాంటి అనుబంధమే ఈ విజయంలో ప్రతిఫలించిందని తెలిపారు. అనిల్ రావిపూడిని మాస్ పల్స్ తెలిసిన దర్శకుడిగా ప్రశంసించారు.
విక్టరీ వెంకటేష్ మాట్లాడుతూ ఈ సినిమా ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ హిట్గా నిలవడం ఎంతో ఆనందమని తెలిపారు. దర్శకుడు అనిల్ రావిపూడి మాట్లాడుతూ ప్రేక్షకుల ప్రేమే ఈ విజయానికి ప్రధాన కారణమని, చిరంజీవితో పనిచేయడం జీవితాంతం గుర్తుండిపోయే అనుభూతి అని చెప్పారు. దర్శకులు కే. రాఘవేంద్రరావు, వివి వినాయక్, నిర్మాతలు దిల్ రాజు, సుప్రియ, సంగీత దర్శకుడు, గేయ రచయితలు, సాంకేతిక నిపుణులు ఈ వేడుకలో పాల్గొని చిత్ర బృందాన్ని అభినందించారు. ఈ వేడుక తెలుగు సినిమా చరిత్రలో మరో చిరస్మరణీయ ఘట్టంగా నిలిచింది.















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!