

మాస్ మహారాజా రవి తేజ ప్రస్తుతం కాస్త కష్టకాలంలో ఉన్నారు. గత కొంతకాలంగా ఆయన సినిమాలు బాక్సాఫీస్ వద్ద బాగా ఆడలేదు. ప్రేక్షకులు కూడా ఆయన మీద అసంతృప్తిగా ఉన్నారు - మంచి కథలు ఎంచుకోకపోవడం వల్లనే ఇలా జరుగుతోందని అభిమానులు అంటున్నారు. ఇటీవల విడుదలైన మాస్ జాతర కూడా ఆశించిన స్థాయిలో ఆడలేదు. ఇప్పుడు ఆయన కొత్త సినిమా భర్తా మహాశయులకు విజ్ఞప్తిపై ఆశలు పెట్టుకున్నారు. కిషోర్ తిరుమల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా హాస్యభరితంగా ఉండబోతుందనే అభిప్రాయం ఉంది. విడుదలైన ఫస్ట్ గ్లింప్స్ కూడా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన తెచ్చుకుంది.
అయితే ఈ సినిమా సంక్రాంతి 2026 సమయంలో విడుదల చేయాలని టీమ్ నిర్ణయించింది. ఇది రవి తేజ కోసం ఒక పెద్ద రిస్క్‌గానే చెప్పాలి. ఎందుకంటే ఆ సమయంలో పెద్ద సినిమాలు చాలా ఉన్నాయి - ది రాజా సాబ్, మన శంకర్ వరప్రసాద్ గారు, అనగనగా ఒక రాజు, నారీ నారీ నడుమ మురారి లాంటి సినిమాలు కూడా అదే సమయంలో వస్తున్నాయి. అదే కాకుండా తమిళ స్టార్ విజయ్ సినిమా జననాయకుడు, శివకార్తికేయన్ సినిమా పరాశక్తి కూడా విడుదల కానున్నాయి. ఇవన్నీ పెద్ద సినిమాలు కావడంతో ఎక్కువ థియేటర్లను ఆక్రమించే అవకాశం ఉంది. ఇలాంటి సమయంలో రవి తేజ సినిమా విడుదలైతే స్క్రీన్లు దొరకడం కష్టం అవుతుంది. సినిమా బాగున్నా కూడా, కలెక్షన్లపై ప్రభావం పడొచ్చు.
ప్రస్తుతం రవి తేజ కెరీర్ మలుపు వద్ద ఉన్నాడు. కాబట్టి పెద్ద సినిమాలతో పోటీకి వెళ్ళకుండా, వేరే సమయాన్ని ఎంచుకుని విడుదల చేస్తే బాగుండేదని సినీ వర్గాలు భావిస్తున్నాయి.
















కామెంట్స్ (1)
ఈసారి మాస్ మహారాజా బలమైన కమ్బ్యాక్ ఇవ్వాలి!