

నితేశ్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ పౌరాణిక చిత్రం ‘రామాయణం’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి షోలు చూసిన ప్రేక్షకులు ఎక్స్ వేదికగా తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. ముఖ్యంగా సినిమాలోని విజువల్ ఎఫెక్ట్స్, నిర్మాణ విలువలు, సంగీతం, నటీనటుల ప్రదర్శనపై ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. శ్రీరాముడిగా రణబీర్ కపూర్, రావణుడిగా యాష్ తమ పాత్రల్లో ఆకట్టుకున్నారని పలువురు ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. హాలీవుడ్ స్థాయి నిర్మాణ నాణ్యతతో తెరకెక్కిన విజువల్స్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయని పేర్కొంటున్నారు.
రణబీర్ కపూర్ రాముడి పాత్రలో సహజంగా ఒదిగిపోయారని, యాష్ తన స్క్రీన్ ప్రెజెన్స్‌తో ఆకట్టుకున్నారని అభిమానులు చెబుతున్నారు. ముఖ్యంగా జటాయువు సన్నివేశంలోని పోరాటాలు, గ్రాఫిక్స్ ప్రేక్షకులను భావోద్వేగానికి గురిచేశాయని ప్రశంసిస్తున్నారు. సీతగా సాయి పల్లవి, లక్ష్మణుడిగా రవి దూబే, దశరథుడిగా అరుణ్ గోవిల్ తమ పాత్రలకు న్యాయం చేశారని అభిప్రాయపడుతున్నారు. అయితే, రాముడు–సీత మధ్య భావోద్వేగ అనుబంధం మరింత బలంగా ఉండాల్సిందని కొందరు పేర్కొంటున్నారు. కథ నేపథ్యాన్ని వివరించే సన్నివేశాల వల్ల సినిమా నిడివి కొంత నెమ్మదిగా అనిపించినా, హన్స్ జిమ్మర్, ఎ.ఆర్. రెహమాన్ అందించిన సంగీతం, నేపథ్య సంగీతం ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయని చెబుతున్నారు. ఐమాక్స్‌లో ఈ చిత్రాన్ని చూడాలని పలువురు సూచిస్తున్నారు. తొలి భాగంపై వస్తున్న స్పందనతో తదుపరి భాగంపై అంచనాలు పెరిగాయి.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!