

ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో మురసు తుపాను ప్రభావంతో బేతుపల్లి చెరువు అలుగు పొంగి వరద ఉద్ధృతి పెరిగిన సమయంలో ప్రాణాలకు తెగించి సహాయక చర్యలు చేపట్టిన SDRF, NDRF సిబ్బందిని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అభినందించారు. బుధవారం రాత్రి చెరువు వద్ద వరదలో చిక్కుకున్న మత్స్యకారులను రక్షించే క్రమంలో పడవ బోల్తాపడటంతో 11 మంది నీటిలో చిక్కుకున్నారు. సమాచారం అందుకున్న ఖమ్మం కలెక్టర్ దివాకర టీఎస్, ఎస్పీ, పోలీసు, రెవెన్యూ తదితర శాఖల అధికారులు సమన్వయంతో సహాయక చర్యలు చేపట్టారు. SDRF, NDRF బృందాలు తీవ్రంగా శ్రమించి అందరినీ సురక్షితంగా ఒడ్డుకు చేర్చడంతో ప్రాణనష్టం తప్పిందని మంత్రి ప్రశంసించారు.
గురువారం సత్తుపల్లి ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న చాతకొండ ఆరో బెటాలియన్‌కు చెందిన SDRF సిబ్బంది, అగ్నిమాపక శాఖ సిబ్బందిని మంత్రి పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. విధి నిర్వహణలో చూపిన ధైర్యసాహసాలను కొనియాడి శాలువాలతో సత్కరించి పండ్లు అందజేశారు. ఈ ఘటనను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. ఆపద సమయంలో సేవలందించిన అన్ని శాఖల సిబ్బందికి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. SDRF సిబ్బందిలో సొంత ఇల్లు లేని వారు ఎవరైనా ఉంటే, వారు ఏ జిల్లాకు చెందిన వారైనా ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!