

బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌పై కత్తితో దాడి జరిగిన భయానక రాత్రి అనుభవాలను ఆయన భార్య, నటి కరీనా కపూర్ తాజాగా గుర్తుచేసుకున్నారు. 2025 జనవరి 16న తెల్లవారుజామున ముంబయిలోని తమ నివాసంలోకి ఓ దుండగుడు చొరబడి సైఫ్‌పై కత్తితో దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ‘కాఫీ విత్ కరణ్’ కార్యక్రమంలో మాట్లాడిన కరీనా.. దాడి జరిగిన వెంటనే భర్తను ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు సాయం కోసం రోడ్డుపైకి పరుగెత్తినట్లు తెలిపారు. నైట్ టీషర్ట్‌లోనే బయటకు వెళ్లి, కనిపించిన వాహనాలను ఆపుతూ గట్టిగా కేకలు వేసినట్లు చెప్పారు. సైఫ్ రక్తమోడుతుండటంతో ఏం చేయాలో తెలియని పరిస్థితిలో పరిగెత్తానని, ఆ సమయంలో పైజామా వేసుకునే అవకాశం కూడా లేకపోయిందని వెల్లడించారు. అదృష్టవశాత్తూ ఆ సమయంలో ఎవరూ తనను వీడియో తీయలేదని పేర్కొన్నారు.
మరోవైపు, దాడి జరిగిన సమయంలో కుమారుడు తైమూర్ తీవ్రంగా భయపడినట్లు సైఫ్ తెలిపారు. కత్తి గాయాలతో ఉన్న తనను చూసి తైమూర్ వణికిపోయాడని, ‘నాన్నా.. నువ్వు చనిపోతావా?’ అని అడిగాడని గుర్తుచేసుకున్నారు. కుమారుడిని కాపాడే ప్రయత్నంలో దుండగుడు తనపై దాదాపు పదిసార్లు కత్తితో దాడి చేసినట్లు చెప్పారు. కత్తి మరింత పదునుగా ఉండి ఉంటే పరిస్థితి తీవ్రంగా మారేదని వ్యాఖ్యానించారు. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత సైఫ్ ప్రశాంతంగా కనిపించడంతో దాడి నిజంగానే జరిగిందా అంటూ సోషల్ మీడియాలో సందేహాలు వ్యక్తమయ్యాయని కరీనా ప్రస్తావించారు. అయితే, ఆ ఘటన తమ కుటుంబంపై తీవ్ర ప్రభావం చూపిందని, దాదాపు ఆరు నెలల పాటు సరిగ్గా నిద్రపోలేకపోయామని ఆమె వెల్లడించారు.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!