

భారతీయ సినీ పరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో ఒకటిగా తెరకెక్కిన ‘రామాయణ’ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రావడంతో మరోసారి వార్తల్లో నిలిచింది. నితీష్ తివారీ దర్శకత్వంలో రణ్‌బీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా నటించిన ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ప్రాజెక్టు ప్రారంభ దశకు సంబంధించిన పాత ఫొటో ప్రస్తుతం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. 2019 జూలైలో ట్రేడ్ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ చేసిన ట్వీట్ ప్రకారం.. అల్లు అరవింద్, మధు మంతెన, నమిత్ మల్హోత్రా కలిసి మూడు భాగాల 3D చిత్రంగా ‘రామాయణ’ను నిర్మించనున్నట్లు ప్రకటించారు. నితీష్ తివారీ, రవి ఉద్యావర్ సంయుక్తంగా దర్శకత్వం వహిస్తారని వెల్లడిస్తూ ఐదుగురూ కలిసి దిగిన ఫొటోను అప్పట్లో విడుదల చేశారు.
అయితే, ప్రారంభంలో ప్రకటించిన బృందంలో తర్వాత అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. రవి ఉద్యావర్, అల్లు అరవింద్, మధు మంతెన ప్రాజెక్టు నుంచి తప్పుకున్నట్లు కథనాలు వెలువడ్డాయి. బడ్జెట్, సృజనాత్మక అంశాలు, ఐపీ హక్కులకు సంబంధించిన వివాదాలు కూడా ప్రాజెక్టు చుట్టూ చర్చకు దారితీశాయి. ఈ పరిణామాల తర్వాత DNEG అధినేత నమిత్ మల్హోత్రా ప్రాజెక్టు బాధ్యతలను ప్రధానంగా చేపట్టగా, కన్నడ నటుడు యశ్ సహ నిర్మాతగా చేరి రావణుడి పాత్రను పోషిస్తున్నారు. మొదట ఐదుగురి భాగస్వామ్యంతో ప్రారంభమైన ఈ ప్రాజెక్టు ప్రస్తుత రూపానికి చేరుకునే క్రమంలో ఎన్నో మార్పులు, మలుపులు ఎదుర్కొందన్న విషయాన్ని పాత ఫొటో మరోసారి గుర్తుచేస్తోంది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!