

భారతీయ సంప్రదాయంలో ధంతేరాస్, దీపావళి పండుగలకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. ఈ పండుగల సందర్భంగా కొత్త వస్తువులు కొనుగోలు చేయడం శుభప్రదంగా భావిస్తారు. ముఖ్యంగా కార్తీక మాసం కృష్ణ పక్ష త్రయోదశి రోజున జరుపుకునే ధంతేరాస్ సందర్భంగా బంగారం, వెండి కొనుగోళ్లకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. ఈ రోజున ధన్వంతరి, కుబేరుడిని పూజించడం వల్ల ఇంట్లో సంపద, సుఖసంతోషాలు కలుగుతాయని నమ్ముతారు. అయితే ప్రస్తుతం బంగారం, వెండి ధరలు అధికంగా ఉండటంతో చాలామందికి వాటిని కొనుగోలు చేయడం భారంగా మారింది. అలాంటి వారు తక్కువ ధరలో లభించే కొన్ని సంప్రదాయ వస్తువులను ధంతేరాస్ రోజున కొనుగోలు చేయవచ్చని పండితులు సూచిస్తున్నారు.
ఆ వస్తువుల్లో గోమతీ చక్రాలు, గవ్వలు, శంఖం, లక్ష్మీదేవి-గణేశుడి విగ్రహాలు, చీపురు, పాత్రలు, మట్టి దీపాలు, ఖిల్-బతాషాలు ఉన్నాయి. గోమతీ చక్రాలు, గవ్వలను సంపదకు, శుభానికి ప్రతీకలుగా భావిస్తారు. శంఖాన్ని పూజలో ఉపయోగించడం శుభప్రదమని నమ్ముతారు. దీపావళి పూజ కోసం లక్ష్మీదేవి, గణేశుడి విగ్రహాలను కొనుగోలు చేస్తారు. అలాగే పాత్రలు, చీపురు కొనడం ధంతేరాస్ సంప్రదాయంలో భాగంగా కొనసాగుతోంది. దీపావళి రోజున ఇళ్లలో మట్టి దీపాలు వెలిగించడంతో పాటు ఖిల్, బతాషాలను లక్ష్మీదేవికి నైవేద్యంగా సమర్పిస్తారు. బంగారం, వెండి కొనుగోలు చేయలేకపోయినా ఈ వస్తువులను కొనడం ద్వారా శుభం, సంపద కలుగుతాయని సంప్రదాయ విశ్వాసం.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!