

‘సింగ్ గీతం’ విడుదలకు ముందు చిత్రబృందం ప్రత్యేక వీడియో సంభాషణను విడుదల చేసింది. ఇందులో దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి, నిర్మాత-దర్శకుడు నాగ్ అశ్విన్, సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ పాల్గొని తమ అభిప్రాయాలను పంచుకున్నారు. 1995లో ఎం.ఎం. కీరవాణి ద్వారా ఈ కథా ఆలోచన గురించి తొలిసారి విన్నానని, అప్పుడే ఆ కాన్సెప్ట్ తనను ఆశ్చర్యపరిచిందని రాజమౌళి తెలిపారు. ఇలాంటి విభిన్నమైన కథను ఆవిష్కరించగల సృజనాత్మక దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు అని కొనియాడుతూ, ఈ ప్రాజెక్ట్‌కు మద్దతుగా తొలి టికెట్‌ను కొనుగోలు చేశారు.
‘మహానటి’ సమయంలో సింగీతం శ్రీనివాసరావుతో తన అనుబంధం ప్రారంభమైందని నాగ్ అశ్విన్ గుర్తు చేసుకున్నారు. మొదట ఆయనకు నివాళిగా ఈ చిత్రాన్ని నిర్మించాలని భావించినప్పటికీ, కథపై మరింత అవగాహన పెరిగిన తర్వాత ఇది అన్ని వయసుల ప్రేక్షకులను ఆకట్టుకునే అద్భుతమైన చిత్రం అని నమ్మకం కలిగిందన్నారు. మరోవైపు, దేవి శ్రీ ప్రసాద్ మాట్లాడుతూ సంగీత ప్రధాన చిత్రానికి సంగీతం అందించడం తనకు కొత్త అనుభవమని, షూటింగ్ ప్రారంభానికి ముందే దాదాపు 200 ట్రాక్‌లు సిద్ధం చేశానని వెల్లడించారు. సంగీతం, ఫాంటసీ, అతీంద్రియ అంశాల సమ్మేళనంగా రూపొందిన ‘సింగ్ గీతం’ రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!