

టాలీవుడ్ ప్రముఖ నిర్మాత, రచయిత కోన వెంకట్ సినీ పరిశ్రమలోని ప్రస్తుత పరిస్థితులపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. సినిమాల నిడివి పెరగడం, సరైన ప్రణాళిక లేకపోవడం వల్ల నిర్మాతలు భారీగా నష్టపోతున్నారని అన్నారు. సినిమా ప్రారంభించే ముందే దర్శకులకు కథపై స్పష్టత, బాధ్యత ఉండాలని సూచించారు. దాదాపు నాలుగు గంటల ఫుటేజ్‌ను చిత్రీకరించి, ఎడిటింగ్ సమయంలో అందులోని పెద్ద భాగాన్ని తొలగించడం వల్ల ప్రయోజనం ఏమిటని ప్రశ్నించారు. ఇలాంటి నిర్లక్ష్యంతో నిర్మాతలకు నష్టం కలిగించే దర్శకులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఘాటుగా వ్యాఖ్యానించారు.
మరోవైపు, పాన్ ఇండియా సినిమాల మోజులో కొందరు హీరోలు ఏళ్ల తరబడి ఒక్క సినిమాకే పరిమితమవుతున్నారని కోన వెంకట్ విమర్శించారు. ఏడాదికి కనీసం రెండు సినిమాలు విడుదల చేస్తేనే సినీ కార్మికులకు పని లభించడంతో పాటు పరిశ్రమలో కార్యకలాపాలు కొనసాగుతాయని అభిప్రాయపడ్డారు. ఇటీవలి కాలంలో టాలీవుడ్‌తో పాటు పాన్ ఇండియా చిత్రాల నిడివి మూడు గంటలు దాటుతుండటంపై కూడా ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అనవసర సన్నివేశాలు, సరైన ఎడిటింగ్ లేకపోవడం వల్ల కంటెంట్ దెబ్బతిని సినిమాలు పరాజయం పాలవుతున్నాయని అన్నారు. సినిమా హిట్ అయితే పెట్టుబడి తిరిగి వచ్చే అవకాశం ఉన్నా, ఫ్లాప్ అయితే నిర్మాతలు భారీ నష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. పరిశ్రమ మనుగడ కోసం మెరుగైన ప్రణాళిక, కట్టుదిట్టమైన స్క్రీన్‌ప్లే, క్రమశిక్షణతో కూడిన నిర్మాణ విధానాలు అవసరమని పేర్కొన్నారు.

















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!