

కోలీవుడ్ హీరో విశాల్, దర్శకుడు పీఎస్ మిత్రన్ మరోసారి కలిసి ‘అభిమన్యుడు 2’ తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నట్లు సినీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. 2018లో విడుదలైన ‘అభిమన్యుడు’ సినిమా అప్పట్లో బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఫోన్ హ్యాకింగ్, డేటా చోరీ వంటి సాంకేతిక అంశాలతో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంది. అప్పటి నుంచి సీక్వెల్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం, ‘అభిమన్యుడు 2’ కోసం పీఎస్ మిత్రన్ కృత్రిమ మేధ (ఏఐ) నేపథ్యంలో ఓ ఆసక్తికరమైన కథను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఈ భారీ ప్రాజెక్టును నిర్మించేందుకు పలు నిర్మాణ సంస్థలతో చర్చలు జరుగుతున్నాయని ఇండస్ట్రీ వర్గాల సమాచారం.
ఇక ఈ సినిమాలో సమంత నటించనున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. అయితే ఇటీవల తల్లి అయిన సమంత ప్రస్తుతం సినిమాలకు విరామం తీసుకున్నారు. ఆమె తిరిగి సినిమాల్లోకి వచ్చేందుకు మరికొంత సమయం పట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సమంత స్థానంలో మరో హీరోయిన్‌ను తీసుకోకుండా, ఆమె రీఎంట్రీ ఇచ్చిన తర్వాతే షూటింగ్ ప్రారంభించాలని విశాల్, మిత్రన్ భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో సీక్వెల్‌లో సమంత భాగమవుతారనే అంచనాలు పెరుగుతున్నాయి. అయితే ఈ ప్రాజెక్టుపై చిత్రబృందం నుంచి ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడలేదు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!