

విరాట్ కర్ణ కథానాయకుడిగా, అభిషేక్ నామా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పౌరాణిక సాహస చిత్రం ‘నాగబంధం’ విడుదలకు ముందే భారీ అంచనాలు సొంతం చేసుకుంది. ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ప్రచార వీడియోలు, పోస్టర్లు సినిమాపై ఆసక్తిని మరింత పెంచగా.. ఇప్పుడు మరో ప్రత్యేక కార్యక్రమంతో చిత్రబృందం వార్తల్లో నిలిచింది. హైదరాబాద్‌లోని అల్లు సినిమాస్‌లో ఈ చిత్రానికి ప్రత్యేక రెడ్ కార్పెట్ ప్రీమియర్‌ను నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని సమాచారం. పలువురు సినీ ప్రముఖులు, పరిశ్రమకు చెందిన అతిథులు పాల్గొనేలా ఈ వేడుకను ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. విడుదలకు ముందే సినిమాపై మరింత హైప్ తీసుకొచ్చే ప్రయత్నంగా ఈ ఈవెంట్‌ను భావిస్తున్నారు.
జూలై 2వ తేదీ రాత్రి 9 గంటలకు ఈ ప్రత్యేక ప్రదర్శన జరగనుండగా.. ఎన్‌ఐకే స్టూడియోస్, అభిషేక్ పిక్చర్స్ సంస్థలు సంయుక్తంగా చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. కిషోర్ అన్నపురెడ్డి, నిషిత నాగిరెడ్డి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. నభా నటేష్, ఐశ్వర్య మీనన్ కథానాయికలుగా నటిస్తుండగా.. జగపతి బాబు, మహేష్ మంజ్రేకర్, మురళీ శర్మ, దక్షా నగార్కర్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. అత్యున్నత సాంకేతిక విలువలు, విశాలమైన నిర్మాణ శైలి, పౌరాణిక నేపథ్యంతో రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందిస్తుందనే నమ్మకంతో చిత్రబృందం ముందుకు సాగుతోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!