

ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసురాలు, భారతరత్న ఎం.ఎస్. సుబ్బులక్ష్మి జీవిత కథ ఆధారంగా తెరకెక్కనున్న చిత్రం లాంఛనంగా ప్రారంభమైంది. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రష్మిక మందన్న ఎం.ఎస్. సుబ్బులక్ష్మి పాత్రలో నటించనున్నారు. ‘ఎం.ఎస్. – ఏ లెగసీ ఆన్ స్క్రీన్’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. చెన్నైలో ఎం.ఎస్. సుబ్బులక్ష్మి 110వ జయంతిని పురస్కరించుకుని నిర్వహించిన కార్యక్రమంలో సినిమా ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి కమల్ హాసన్ క్లాప్ కొట్టారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించనున్నారు. ఈ చిత్రాన్ని అల్లు అరవింద్, రాక్‌లైన్ వెంకటేశ్, బన్నీ వాస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
దర్శకుడు గౌతమ్ తిన్ననూరి మాట్లాడుతూ.. తొలుత దేశంలోని గొప్ప సంగీత సామ్రాజ్ఞి జీవితాన్ని తెరకెక్కిస్తున్నామని భావించామని, అయితే ఆమె జీవితం గురించి లోతుగా అధ్యయనం చేసినప్పుడు ఎం.ఎస్. సుబ్బులక్ష్మి కేవలం గొప్ప సంగీత కళాకారిణి మాత్రమే కాదని, అసాధారణ జీవితాన్ని గడిపిన వ్యక్తి అని అర్థమైందన్నారు. మధురైలో జన్మించిన ఆమె తన సంగీతంతో దక్షిణ భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను అలరించారని చెప్పారు. జీవితకాల క్రమశిక్షణ, సహనం, అంకితభావంతో ఆమె విజయాలను సాధించారని, ఆ స్ఫూర్తిని ఈ తరానికి అందించాలనే ఉద్దేశంతో ఈ సినిమా రూపొందిస్తున్నామని తెలిపారు.
రష్మిక మాట్లాడుతూ.. ఇంత గొప్ప పాత్రను పోషించే అవకాశం లభించడం పట్ల ఎంతో కృతజ్ఞతగా, గౌరవంగా భావిస్తున్నానన్నారు. ఎం.ఎస్. సుబ్బులక్ష్మి జీవిత ప్రయాణంలో చిన్న భాగంగా మారడం తనకు ఎంతో గర్వంగా ఉందని చెప్పారు. ఎం.ఎస్. అమ్మ పాత్రకు పూర్తి న్యాయం చేస్తూ, ప్రేక్షకులకు నచ్చేలా నటించేందుకు తన వంతు ప్రయత్నం చేస్తానన్నారు.
కమల్ హాసన్ మాట్లాడుతూ.. ఎం.ఎస్. సుబ్బులక్ష్మి సంస్కృతం, హిందీ, తెలుగు, తమిళం, కన్నడ తదితర భాషల్లో పాడినా, ప్రతి భాషకూ తన గానంతో ప్రత్యేక అందాన్ని తీసుకొచ్చేవారని అన్నారు. ఆమె సంగీతమే ప్రపంచానికి అందించిన గొప్ప సందేశమని చెప్పారు. మహాత్మా గాంధీ కూడా ఎం.ఎస్. సుబ్బులక్ష్మి గానానికి అభిమాని అని గుర్తుచేశారు. ఎం.ఎస్. అమ్మ పాత్రలో నటించే అవకాశం రష్మికకు దక్కడం పట్ల తాను అసూయపడటం లేదని సరదాగా వ్యాఖ్యానించారు. గడ్డం తీసేసుకున్నా తాను ఆ పాత్రలో నటించి మెప్పించలేనని అన్నారు. భారతీయ మహిళల్లో విశ్వాసాన్ని నింపిన ఐకానిక్ మహిళగా ఎం.ఎస్. సుబ్బులక్ష్మిని అభివర్ణించారు.
బన్నీ వాస్ మాట్లాడుతూ.. ఈ సినిమాను నిర్మించే అవకాశం రావడం నిర్మాతగా తనకు ఎంతో సంతృప్తిని ఇస్తోందన్నారు. యానిమేటర్‌గా ఉన్న తనను నిర్మాతగా మార్చింది అల్లు అర్జున్ అని, ఆయన వల్లే ఇంత గొప్ప చిత్రాన్ని నిర్మించే అవకాశం దక్కిందని చెప్పారు. ఎం.ఎస్. సుబ్బులక్ష్మి తన విజయాలను దేవుడికి అంకితం చేశారని, ఎంతో సాధారణమైన జీవితాన్ని గడిపారని పేర్కొన్నారు.
రాక్‌లైన్ వెంకటేశ్ మాట్లాడుతూ.. ఎం.ఎస్. సుబ్బులక్ష్మి జీవితంపై సుమారు ఏడేళ్లుగా పరిశోధన చేస్తున్నామని తెలిపారు. ఆమె పాత్రకు సరైన నటిని ఎంపిక చేయడం చాలా కష్టమైన ప్రక్రియగా మారిందన్నారు. పలువురితో చర్చించిన అనంతరం రష్మిక అయితే ఈ పాత్రలో ప్రేక్షకులను మెప్పించగలదనే నమ్మకంతో ఆమెను ఎంపిక చేసినట్లు చెప్పారు.
అల్లు అరవింద్ మాట్లాడుతూ.. ఎం.ఎస్. సుబ్బులక్ష్మి గొప్ప సంగీతకారిణి అని అందరికీ తెలుసని, అయితే ఆమె జీవితంలో ఎదుర్కొన్న అనేక సంఘటనల గురించి తెలుసుకున్న తర్వాత ఈ బయోపిక్‌ను తెరకెక్కించాలనే ఆలోచన మరింత బలపడిందన్నారు. ఆమె పాటించిన నియమాలు, చూపించిన ధైర్యం, క్రమశిక్షణ ఎంతో స్ఫూర్తిదాయకమని చెప్పారు. చిన్న వయసు నుంచే సంగీతంపై ఆసక్తితో గొప్ప లక్ష్యం వైపు ఆమె ఏకాగ్రతతో సాగారని తెలిపారు. ఎం.ఎస్. అమ్మ సంగీతాన్ని యథాతథంగా పునఃసృష్టించే ప్రయత్నం చేయడం లేదని, అనిరుధ్ సంగీతంతో ఒక గొప్ప బయోపిక్‌ను రూపొందిస్తున్నామని చెప్పారు. ఈ సినిమాను నాలుగు దక్షిణ భారతీయ భాషల్లో విడుదల చేయనున్నట్లు వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో హీరోయిన్ సుహాసిని, నటుడు శివకుమార్, దర్శకుడు మహేంద్రన్, నటుడు సముద్రఖని, నిర్మాతలు కలైపులి ఎస్. థాను, రాజేంద్రన్, కాట్రగడ్డ ప్రసాద్, ఎం.ఎస్. సుబ్బులక్ష్మి మనవడు చంద్రశేఖర్, ఆయన సతీమణి మాల తదితరులు పాల్గొన్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!