

‘‘నారీ నారీ నడుమ మురారి’’తో చెప్పి మరీ హిట్ కొట్టానని కథానాయకుడు శర్వానంద్ అన్నారు. కథ విన్న మొదటి రోజే ఈ సినిమా తనకు గట్టి నమ్మకాన్ని ఇచ్చిందని, ఎప్పుడు విడుదల చేసినా ఇది బ్లాక్బస్టర్ అవుతుందన్న విశ్వాసం ఉండేదని చెప్పారు. తాజాగా ఆ నమ్మకం నిజం కావడంతో ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఈ చిత్రానికి రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించగా, అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర నిర్మించారు. హైదరాబాద్లో నిర్వహించిన సక్సెస్ మీట్లో దిల్రాజు, శ్రీను వైట్ల అతిథులుగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా శర్వానంద్ మాట్లాడుతూ, హిట్ కోసం చాలా రోజులుగా ఎదురుచూశానని, ఆ విజయాన్ని అందించిన దర్శకుడు రామ్ అబ్బరాజుకు కృతజ్ఞతలు తెలిపారు. నరేశ్ నటనను ప్రత్యేకంగా ప్రశంసిస్తూ, సినిమా చూసిన ప్రేక్షకులు చాలా రోజుల తర్వాత ఇలా నవ్వుకున్నామని చెబుతుంటే ఆనందంగా ఉందన్నారు. తాను సంక్రాంతికి వచ్చిన ప్రతిసారి సినిమాలు ఆడతాయని పేర్కొంటూ, ఇకపై ప్రతి సంక్రాంతికి తనకోసం ఒక స్లాట్ పక్కన పెట్టాలని సరదాగా వ్యాఖ్యానించారు. వచ్చే సంక్రాంతికి మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో శ్రీను వైట్ల దర్శకత్వంలో తన తదుపరి సినిమా విడుదలవుతుందని ప్రకటించారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!