

భారత్ తరఫున ఆస్కార్ పోటీలోకి వెళ్లిన చిత్రం హోమ్ బౌండ్ ఈసారి తుది దశకు చేరుకోలేకపోయింది. 2026 లో జరగనున్న 98 వ ఆస్కార్ అవార్డ్స్‌లో ఉత్తమ అంతర్జాతీయ చిత్రం విభాగానికి భారత అధికారిక ఎంట్రీగా ఎంపికైన ఈ సినిమా, చివరి నామినేషన్ల జాబితాలో చోటు దక్కించుకోలేక పోటీ నుంచి తప్పుకుంది.
దర్శకుడు నీరజ్ ఘైవాన్ తెరకెక్కించిన ఈ చిత్రం, 2025 డిసెంబర్లో టాప్–15 షార్ట్‌లిస్ట్‌లోకి చేరి ఆశలు రేకెత్తించింది. అయితే తుది దశలో ప్రకటించిన టాప్–5 జాబితాలో పేరు లేకపోవడంతో ఆస్కార్ బరిలో నుంచి ఎలిమినేట్ అయ్యింది.
ఈ సినిమాలో ఇషాన్ ఖట్టర్, జాన్వీ కపూర్, విశాల్ జెత్వా ప్రధాన పాత్రలు పోషించారు. ఉత్తర భారతదేశానికి చెందిన ఇద్దరు స్నేహితుల జీవిత ప్రయాణాన్ని ఆధారంగా తీసుకుని, కులం, మతం, కరోనా లాక్డౌన్ వంటి సామాజిక అంశాలను స్పృశిస్తూ ఈ కథ సాగుతుంది. విడుదలైనప్పటి నుంచి ఈ చిత్రానికి విమర్శకుల ప్రశంసలు లభించాయి.
ఈ ఏడాది ఆస్కార్ పోటీ అత్యంత తీవ్రంగా ఉండటంతో, ఫ్రాన్స్, జర్మనీ, డెన్మార్క్ వంటి దేశాల నుంచి వచ్చిన బలమైన చిత్రాలు ముందంజలో నిలిచాయి. ఆస్కార్ నామినేషన్ దక్కకపోయినా, ప్రజల జీవిత కథలను నిజాయితీగా చెప్పే సినిమాలు తాను కొనసాగిస్తానని దర్శకుడు నీరజ్ ఘైవాన్ తెలిపారు.
ఇదిలా ఉండగా, ఈ ఏడాది ఆస్కార్ ఉత్తమ అంతర్జాతీయ చిత్రం విభాగంలో తుది టాప్–5 నామినీలుగా
ది సీక్రెట్ ఏజెంట్ (బ్రెజిల్), ఇట్ వాస్ అన్అక్సిడెంట్ (ఫ్రాన్స్), సెంటిమెంటల్ వాల్యూ (నార్వే), సిరత్ (స్పెయిన్), ది వాయిస్ ఆఫ్ హింద్ రజబ్ (టునీషియా) చిత్రాలు ఎంపికయ్యాయి.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!