

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్లో వచ్చిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం ఉగాది సందర్భంగా మార్చి 19, 2026 ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గబ్బర్ సింగ్ తర్వాత ఈ ఇద్దరి కలయిక పై భారీ అంచనాలు నెలకొన్నప్పటికీ, ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మిశ్రమ స్పందనను పొందింది. సినిమా వసూళ్ల పై సోషల్ మీడియాలో వస్తున్న విమర్శలు, ట్రోలింగ్ పై తాజాగా అభిమానులతో జరిగిన ఇంటరాక్షన్లో హరీష్ శంకర్ స్పందించారు. ట్రోలర్లను తాను అసలు సీరియస్గా తీసుకోనని ఆయన స్పష్టం చేశారు.
ట్రోలింగ్ చేసే వాళ్లు తమ అసలు పేర్లు, వివరాలు బయటపెట్టడానికి కూడా ధైర్యం చేయరు. నేను మాట్లాడే ప్రతి మాటకు బాధ్యత వహిస్తాను. కానీ ముఖం దాచుకుని విమర్శించే వారి మాటలకు ప్రాముఖ్యత ఇవ్వాల్సిన అవసరం లేదు. వారిని పట్టించుకుంటే నేను అప్పుడే సోషల్ మీడియాను వదిలేసేవాడిని అని తెలిపారు. అలాగే, తన వ్యక్తిగత అనుభవాన్ని పంచుకుంటూ.. తాను డైరెక్టర్ అవుతానని చెప్పినప్పుడు మొదటగా విమర్శించినవారు తన తల్లిదండ్రులేనని ఆసక్తికరంగా చెప్పారు. ఎన్నో సవాళ్లను ఎదుర్కొని సినిమాను అనుకున్న సమయానికి ముందే పూర్తి చేసి విడుదల చేయడం తనకు పెద్ద విజయం అని అన్నారు.
సినిమా ఫలితం పై తాను పూర్తిగా సంతృప్తిగా ఉన్నానని, ప్రేక్షకులు ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రాన్ని ఆదరిస్తున్నారని హరీష్ శంకర్ ధీమా వ్యక్తం చేశారు. ఇకపై హద్దులు దాటి అసభ్యంగా విమర్శించే వారిని బ్లాక్ చేయడమే కాకుండా, అవసరమైతే చట్టపరమైన చర్యలు కూడా తీసుకుంటానని హెచ్చరించారు.








.png&w=3840&q=75)



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!