

ప్రముఖ పంజాబీ గాయకుడు, నటుడు దిల్జిత్ దోసాంజ్ మరోసారి తన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. నవంబర్ 15న ఇందౌర్‌లో నిర్వహించిన కచేరీని ‘జై శ్రీ మహాకాల్’ నినాదంతో ప్రారంభించిన ఆయన.. తన ప్రదర్శనకు ఎదురైన అడ్డంకులపై స్పందించారు. మహాకాలుడి నేలపైకి రావడాన్ని ఎవరూ ఆపలేరని, గతంలోనూ తాను భయపడలేదని, ఇప్పుడూ భయపడటం లేదని అభిమానులతో అన్నారు. తనపై ఎన్ని ఆంక్షలు విధించినా, అభిమానులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకునేందుకే ఇందౌర్‌కు వచ్చానని పేర్కొన్నారు. ఒకసారి వస్తానని మాట ఇస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గనని స్పష్టం చేశారు. ఈ దేశంలో అందరి రక్తం కలిసే ఉందని, హిందుస్థాన్ ఎవరి సొత్తూ కాదని ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి.
అయితే, ఈ కచేరీకి ముందే వివాదాలు మొదలయ్యాయి. మద్యం, మాదకద్రవ్యాలు, ఆయుధాలను ప్రోత్సహించేలా సాహిత్యం ఉందన్న కారణంతో నాలుగు పాటలు పాడకూడదని అధికారులు దిల్జిత్‌కు ఆదేశాలు జారీ చేశారు. ఆ పాటలు చిన్నారులపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు, కచేరీకి ముందు ఇందౌర్‌లోని మూడు ప్రైవేటు పాఠశాలలు, మేయర్ కార్యాలయానికి బాంబు బెదిరింపులు రావడం కలకలం రేపింది. అయితే, పోలీసుల ప్రాథమిక విచారణలో ఆ బెదిరింపులు నకిలీవని తేలింది. ఈ పరిణామాల నేపథ్యంలో దిల్జిత్ వ్యాఖ్యలు మరింత చర్చకు దారితీశాయి.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!