

బాలీవుడ్ సీనియర్ నటుడు అమితాబ్ బచ్చన్, ఆయన కుమారుడు అభిషేక్ బచ్చన్‌లకు మరోసారి ప్రాణహాని బెదిరింపులు వచ్చినట్లు సమాచారం. గ్యాంగ్‌స్టర్ గోల్డీ ధిల్లాన్ సోషల్ మీడియా వేదికగా వీరిద్దరినీ కాల్చి చంపుతామని హెచ్చరించినట్లు తెలుస్తోంది. ముంబైలో తమ గ్యాంగ్‌కు చెందిన దాదాపు 200 మంది అనుచరులు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నాడు. బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు, జాకెట్లు, పోలీసుల భద్రత ఉన్నప్పటికీ దాడి చేస్తామని బెదిరించినట్లు సమాచారం. ఢిల్లీ పోలీసులు ఇటీవల అరెస్ట్ చేసిన వికాస్ ఠాకూర్, దీపక్ సింగ్‌ల అరెస్టులతో తమ ప్రణాళికకు ఎలాంటి ఆటంకం కలగదని కూడా ధిల్లాన్ వ్యాఖ్యానించినట్లు కథనాలు వెల్లడిస్తున్నాయి. వరుస బెదిరింపుల నేపథ్యంలో అమితాబ్ నివాసం వద్ద ముంబై పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు.
కాగా, అమితాబ్ బచ్చన్ నివాసంపై దాడికి కుట్ర పన్నారనే అనుమానంతో వికాస్ ఠాకూర్, దీపక్ సింగ్‌లను ఢిల్లీ పోలీసులు 2026 నవంబర్ 15న అరెస్ట్ చేసినట్లు సమాచారం. 1984లో ఇందిరా గాంధీ హత్య అనంతరం జరిగిన సిక్కు వ్యతిరేక అల్లర్ల సమయంలో అమితాబ్ చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యాఖ్యలే ఈ కుట్రకు కారణమని పోలీసులు అనుమానిస్తున్నట్లు కథనాలు పేర్కొంటున్నాయి. అయితే, తనపై వచ్చిన ఆరోపణలను అమితాబ్ మొదటి నుంచీ ఖండిస్తున్నారు. తాను సిక్కు సమాజానికి వ్యతిరేకంగా ఎలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయలేదని, ఇందిరా గాంధీ మరణం తనను తీవ్రంగా కలచివేసిందని గతంలో స్పష్టం చేశారు. తాజా బెదిరింపులతో అమితాబ్ కుటుంబ భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.




కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!