

రామోజీరావు జీవితం, ఆయన సాధించిన విజయాలు భావితరాలకు ఎప్పటికీ స్ఫూర్తిదాయకమని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. విజయవాడలో నిర్వహించిన రామోజీ ఎక్స్‌లెన్స్ అవార్డుల ప్రదానోత్సవం-2026లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. వ్యక్తిగతంగా సాధించే విజయం కంటే సమాజంలో సానుకూల మార్పు తీసుకురావడం గొప్ప విషయమని పేర్కొన్నారు. ప్రతిభ, పట్టుదల, సేవాభావంతో ప్రజల జీవితాల్లో మార్పు తీసుకొస్తున్న వ్యక్తులను గుర్తించి సత్కరించడం అభినందనీయమన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో ప్రతిభ, వినూత్న ఆవిష్కరణలతో భారత్ వికసిత్ భారత్-2047 లక్ష్యం వైపు వేగంగా ముందుకు సాగుతోందని తెలిపారు.
సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చిన రామోజీరావు తన కృషి, పట్టుదలతో ఈనాడు, ఈటీవీ వంటి ప్రతిష్ఠాత్మక సంస్థలను నిర్మించారని పవన్ కళ్యాణ్ కొనియాడారు. ఆసియాలో ప్రముఖ సినీ నిర్మాణ కేంద్రంగా రామోజీ ఫిల్మ్‌సిటీని అభివృద్ధి చేయడంతో పాటు తెలుగు పత్రికా రంగానికి, భాషకు ఆయన చేసిన సేవలను గుర్తుచేశారు. రామోజీరావుతో తనకు ఉన్న వ్యక్తిగత అనుబంధాన్ని ప్రస్తావిస్తూ.. సారా వ్యతిరేక ఉద్యమం, సమాచార హక్కుపై అవగాహన, పర్యావరణ పరిరక్షణ, జల సంరక్షణ వంటి సామాజిక కార్యక్రమాల్లో ఈనాడు అందించిన సేవలను వివరించారు. అవార్డులు అందుకున్న విజేతలకు అభినందనలు తెలిపిన ఆయన.. వ్యక్తిగత విజయం ఇతరుల జీవితాల్లో వెలుగులు నింపినప్పుడే దానికి సంపూర్ణ అర్థం వస్తుందని అన్నారు.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!