

ప్రశాంతత కోసం చేసే ధ్యానం కొందరిలో ఆందోళన, భయాందోళనలు, పాత గాయాలకు సంబంధించిన బాధాకరమైన జ్ఞాపకాలను మళ్లీ గుర్తుకు తెచ్చే అవకాశముందని తాజా పరిశోధనలు హెచ్చరిస్తున్నాయి. మెల్బోర్న్ విశ్వవిద్యాలయంలో జరిగిన అధ్యయనం ప్రకారం, దాదాపు 60 శాతం మంది ధ్యానం చేసే వారిలో ఏదో ఒక రకమైన ప్రతికూల ప్రభావం కనిపించింది. “ధ్యానం మెదడును లోతైన ఆత్మపరిశీలనకు తీసుకెళ్తుంది. ఆ ప్రక్రియలో మునుపు దాచిపెట్టిన భావోద్వేగాలు బయటకు రావచ్చు”, అని వైద్యులు తెలిపారు. ముఖ్యంగా ముందే మానసిక క్షోభ లేదా ఆందోళన సమస్యలు ఉన్నవారిలో ఈ ప్రభావాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని అన్నారు.
అమెరికాలో దాదాపు 900 మంది ధ్యానం చేసే వ్యక్తులపై నిర్వహించిన ఈ అధ్యయనంలో, 30 శాతం మంది సవాలుతో కూడిన లేదా బాధాకరమైన అనుభూతులను, 9 శాతం మంది రోజువారీ పనుల్లో ఆటంకాలను ఎదుర్కొన్నట్లు వెల్లడైంది. ఈ విషయంపై మానసిక వైద్యులు మాట్లాడుతూ, “ధ్యానంలో కొంత అసౌకర్యం సహజమే. కానీ తీవ్ర భయం, పనితీరు దెబ్బతినేంత బాధ కలిగితే వెంటనే నిపుణుల సలహా తీసుకోవాలి”, అని సూచిస్తున్నారు. ధ్యానం చేయవద్దని భయపెట్టడం తమ ఉద్దేశం కాదని, కానీ శస్త్రచికిత్సకు ముందు రిస్క్‌లు చెప్పినట్లే ధ్యానం నేర్పించేటప్పుడు కూడా దాని దుష్ప్రభావాలపై అవగాహన కల్పించాలని వైద్యులు స్పష్టం చేస్తున్నారు.
గమనిక: ఇక్కడ ఇచ్చిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. దీనికి మేము ఎలాంటి బాధ్యత వహించము. ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉంటే తప్పనిసరిగా వైద్యుడిని లేదా న్యూట్రిషనిస్ట్‌ను సంప్రదించి వారి సలహా మేరకు అనుసరించాలి.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!