

దీపావళి పండుగ అంటేనే వెలుగులు, ఆనందాలు, సంబరాలు. అయితే పండుగ వేళ కాల్చే బాణసంచా నుంచి వెలువడే దట్టమైన పొగ, విషపూరిత వాయువులు, సూక్ష్మ ధూళి కణాలు వాయు కాలుష్యాన్ని పెంచి ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతాయి. ముఖ్యంగా PM2.5, PM10 వంటి సూక్ష్మ కణాలతో పాటు సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్లు, కార్బన్ మోనాక్సైడ్ వంటి కాలుష్య కారకాలు శ్వాస ద్వారా ఊపిరితిత్తుల్లోకి చేరి శ్వాసనాళాల్లో చికాకు, వాపును కలిగిస్తాయి. ఫలితంగా దగ్గు, గొంతులో మంట, ఛాతిలో బిగుతు, గురక, ఆయాసం వంటి సమస్యలు తలెత్తవచ్చు. ఇప్పటికే ఆస్తమా, COPD వంటి శ్వాసకోశ వ్యాధులతో బాధపడేవారిలో ఈ లక్షణాలు మరింత తీవ్రంగా మారే ప్రమాదం ఉంది. అంతేకాకుండా పిల్లలు, వృద్ధులు, గర్భిణులు, అలర్జీలు, గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారు కూడా పటాకుల పొగ పట్ల అప్రమత్తంగా ఉండాలి. పొగలోని ధూళి, రసాయనాలు కళ్లలో మంట, దురద, ఎర్రబడటం, నీరు కారడం వంటి సమస్యలకు కూడా కారణమవుతాయి.
పటాకుల పొగ వల్ల కలిగే ఇబ్బందులను తగ్గించుకోవడానికి కొన్ని జాగ్రత్తలు పాటించడం అవసరం. పొగ ఎక్కువగా ఉన్న సమయంలో బయటకు వెళ్లకుండా ఇంట్లోనే ఉండటం, కిటికీలు, తలుపులు మూసి ఉంచడం, అవసరమైతే HEPA ఫిల్టర్ ఉన్న ఎయిర్ ప్యూరిఫైయర్ ఉపయోగించడం మంచిది. తప్పనిసరిగా బయటకు వెళ్లాల్సి వస్తే సరిగ్గా సరిపోయే N95 మాస్క్ ధరించాలి. అయితే ఇది సూక్ష్మ ధూళి కణాల నుంచి మాత్రమే రక్షణ కల్పిస్తుందని, హానికర వాయువులను పూర్తిగా అడ్డుకోలేదని గుర్తుంచుకోవాలి. కాలుష్యం ఎక్కువగా ఉన్నప్పుడు వాకింగ్, జాగింగ్ వంటి బహిరంగ వ్యాయామాలకు దూరంగా ఉండాలి. ఆస్తమా, COPD రోగులు వైద్యులు సూచించిన మందులు, ఇన్హేలర్లను అందుబాటులో ఉంచుకోవాలి. అలాగే బయటకు వెళ్లే ముందు AQI స్థాయులను పరిశీలించాలి. తీవ్రమైన దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఛాతినొప్పి, నిరంతర గురక లేదా చూపు మసకబారడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్య సహాయం పొందాలి. పటాకుల వినియోగాన్ని తగ్గించి, పర్యావరణహితమైన ప్రత్యామ్నాయాలను ఎంచుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని, పర్యావరణాన్ని కాపాడుకోవచ్చు.
గమనిక: ఈ కథనం సాధారణ ఆరోగ్య అవగాహన కోసం మాత్రమే. వ్యక్తిగత ఆరోగ్య సమస్యలు లేదా సందేహాలు ఉన్నట్లయితే తప్పనిసరిగా వైద్యులను సంప్రదించి వారి సలహా తీసుకోవాలి.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!