

ప్రతిరోజూ టీ, కాఫీ తాగే అలవాటు చాలామందికి ఉంటుంది. అయితే వాటిని మరీ వేడిగా తాగడం ఆరోగ్యానికి హానికరమని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా 65 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రత ఉన్న పానీయాలను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఆహార నాళం (ఈసోఫేగస్) క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరిగే అవకాశం ఉందని పరిశోధనలు సూచిస్తున్నాయి. గ్లెనీగిల్స్ ఆసుపత్రి (చెన్నై) మెడికల్ ఆంకాలజీ కన్సల్టెంట్ డాక్టర్ అరుణ్ రమణన్ వి వివరాల ప్రకారం.. మరీ వేడి పానీయాలు తాగడం వల్ల ఆహార నాళం లోపలి పొర దెబ్బతిని, పదేపదే వాపు, కణాల్లో మార్పులు ఏర్పడవచ్చు. ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్ (IARC) 65 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రత ఉన్న పానీయాలను క్యాన్సర్‌కు కారణమయ్యే అవకాశమున్నవిగా వర్గీకరించింది.
ధూమపానం, మద్యపానం, దీర్ఘకాలిక అసిడిటీ, ఆహార నాళానికి సంబంధించిన సమస్యలు కూడా ఈ క్యాన్సర్ ముప్పును పెంచే కారకాలుగా వైద్యులు పేర్కొంటున్నారు. ఆహారం మింగడంలో ఇబ్బంది, కారణం తెలియకుండా బరువు తగ్గడం, ఛాతీ వెనుక భాగంలో నిరంతర నొప్పి, తరచూ వాంతులు కావడం, వాంతుల్లో రక్తం కనిపించడం వంటి లక్షణాలను నిర్లక్ష్యం చేయకూడదని సూచిస్తున్నారు. టీ, కాఫీలు తయారు చేసిన వెంటనే తాగకుండా కొద్దిసేపు చల్లారిన తర్వాత తీసుకోవడం మంచిదని చెబుతున్నారు. పొగాకు వినియోగానికి దూరంగా ఉండటం, మద్యపానాన్ని పరిమితం చేయడం, జీర్ణ సంబంధిత సమస్యలు దీర్ఘకాలంగా ఉంటే వైద్యులను సంప్రదించడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. అయితే ఈ లక్షణాలు కనిపించినంత మాత్రాన క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారించలేమని గుర్తుంచుకోవాలి.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!