

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాపై ప్రస్తుతం భారీ అంచనాలు ఉన్నాయి. దాదాపు 14 సంవత్సరాల తర్వాత దర్శకుడు హరీష్ శంకర్ తో పవన్ కళ్యాణ్ కలిసి పనిచేస్తుండటంతో ఈ సినిమా ప్రత్యేకంగా నిలిచింది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం సుమారు 150 కోట్ల బడ్జెట్తో తెరకెక్కుతోంది. ఇందులో శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. సంగీతాన్ని దేవిశ్రీ ప్రసాద్ అందిస్తున్నారు. మొదట ఈ నెల 26 న విడుదల కావాల్సిన ఈ సినిమా ఇప్పుడు ఉగాది సందర్భంగా ఈ నెల 19 న ప్రపంచవ్యాప్తంగా విడుదల కావడానికి సిద్ధమవుతోంది.
ఇక హీరోయిన్ శ్రీలీల విషయానికి వస్తే, కన్నడ సినీ పరిశ్రమ నుంచి వచ్చి చాలా తక్కువ సమయంలోనే టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా గుర్తింపు పొందింది. అందం, క్యూట్ లుక్స్, డ్యాన్స్ ప్రతిభతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. కొన్ని సినిమాలు ఆశించిన విజయాన్ని సాధించకపోయినా ఆమెకు వరుస అవకాశాలు వస్తూనే ఉన్నాయి. తెలుగులో టాప్ హీరోయిన్గా ఎదుగుతున్న ఆమె, ఇప్పుడు దేశవ్యాప్తంగా గుర్తింపు పొందేలా తన కెరీర్ను విస్తరించేందుకు ప్రయత్నిస్తోంది. ఇప్పటికే తమిళంలో కూడా ఎంట్రీ ఇచ్చి శివకార్తికేయన్ తో పరాశక్తి సినిమాలో నటించింది. అలాగే ధనుష్ హీరోగా వస్తున్న మరో తమిళ చిత్రంలో కూడా ఆమె నటిస్తోంది. ఇందులో సాయి పల్లవి మరో హీరోయిన్గా కనిపించనుంది. బాలీవుడ్లో కూడా కార్తీక్ ఆర్యన్ సరసన నటిస్తూ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇప్పుడు అందరి దృష్టి శ్రీలీల పారితోషికంపై పడింది. సోషల్ మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో నటించడానికి ఆమె సుమారు 2 నుంచి 3 కోట్ల రూపాయల వరకు పారితోషికం తీసుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. అయితే దీనిపై అధికారిక సమాచారం ఇంకా బయటకు రాలేదు. అంతకు ముందు ఆమె కొన్ని సినిమాలకు 2 నుంచి 4 కోట్ల వరకు పారితోషికం తీసుకున్నట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ వార్తల్లో ఎంత నిజం ఉందో తెలుసుకోవాలంటే అధికారిక ప్రకటన కోసం కొంతకాలం వేచి చూడాల్సిందే.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!