

నమిత్ మల్హోత్రా నిర్మాణంలో నితేశ్ తివారీ దర్శకత్వం వహిస్తున్న భారీ పౌరాణిక చిత్రం రామాయణం: రైజ్ ఆఫ్ ఏ లెజెండ్ మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రమోషన్లతో పాటు ప్రీమియర్ షోల నుంచి వస్తున్న స్పందన సినిమాపై ఆసక్తిని మరింత పెంచుతోంది. బుక్‌మైషోలో ఇప్పటివరకు ఈ చిత్రం 5.23 లక్షలకు పైగా టికెట్లు అమ్ముడుపోయినట్లు సమాచారం. దీంతో యానిమల్, టైగర్ 3, ఛావా వంటి చిత్రాల అడ్వాన్స్ బుకింగ్‌లను అధిగమించింది. అయితే జవాన్ సాధించిన 8.16 లక్షల టికెట్ల విక్రయాలు, ధురంధర్ 2 నమోదు చేసిన 11 లక్షలకు పైగా టికెట్ల రికార్డుల కంటే వెనుకబడి ఉంది. విడుదలకు మరో రెండు రోజులు మాత్రమే సమయం ఉండటంతో జవాన్ రికార్డుకు చేరుకునే లేదా దానిని అధిగమించే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు. అయితే ధురంధర్ 2 రికార్డును అందుకోవడం కష్టమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
మరోవైపు, ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా అడ్వాన్స్ బుకింగ్స్‌లో ఇప్పటికే రూ.100 కోట్ల మార్కును దాటినట్లు సమాచారం. ట్రేడ్ వర్గాల అంచనాల ప్రకారం, తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.150 కోట్లకు పైగా వసూళ్లు సాధించే అవకాశం ఉంది. ఈ చిత్రంలో రణ్‌బీర్ కపూర్, సాయి పల్లవి, యశ్ కీలక పాత్రలు పోషిస్తుండగా.. రవి దూబే, సన్నీ డియోల్, కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్ తదితరులు నటిస్తున్నారు. ఈ ప్రాజెక్టులో తొలి భాగాన్ని సుమారు రూ.2,000 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్నట్లు సమాచారం. ప్రముఖ సంగీత దర్శకులు హన్స్ జిమ్మర్, ఏఆర్ రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. భారీ అడ్వాన్స్ బుకింగ్స్, ప్రేక్షకుల్లో పెరుగుతున్న ఆసక్తితో ఈ సినిమా విడుదలపై సినీ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!