

వినోద రంగంలో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన దిగ్గజ సంస్థ వాల్ట్ డిస్నీ భారీ స్థాయిలో ఉద్యోగుల తొలగింపునకు సిద్ధమవుతున్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. సంస్థ నిర్వహణ వ్యయాలను దాదాపు 20 శాతం తగ్గించుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మేరకు కీలక మేనేజర్లకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. ఖర్చుల నియంత్రణలో భాగంగా వేల సంఖ్యలో ఉద్యోగులను తొలగించడంతోపాటు వివిధ విభాగాల్లో వ్యయాలను తగ్గించే చర్యలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా థీమ్ పార్కులు, టెలివిజన్ నెట్‌వర్క్‌లు, సినిమా నిర్మాణ విభాగాలపై ఈ ప్రభావం అధికంగా ఉండవచ్చని అంచనా. ఈ చర్యల ద్వారా ఆదా చేసిన నిధులను సినిమాలు, టెలివిజన్ కార్యక్రమాలు, సాంకేతికత, థీమ్ పార్కులు, క్రూయిజ్ షిప్ వ్యాపారాల్లో తిరిగి పెట్టుబడిగా పెట్టాలని సంస్థ సీఈవో జోష్ డి'అమారో లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం.
మరోవైపు ఓపెన్ సోర్స్ సాఫ్ట్‌వేర్ రంగానికి చెందిన సూసే (SUSE) సంస్థ కూడా ఉద్యోగుల తొలగింపునకు శ్రీకారం చుట్టింది. సంస్థలో పనిచేస్తున్న మొత్తం ఉద్యోగుల్లో దాదాపు 10 శాతం మందిని తొలగించినట్లు సమాచారం. ఈ మేరకు కంపెనీ సీఈవో డిర్క్ పీటర్ వాన్ లీవెన్ ఉద్యోగులకు అంతర్గత మెమో పంపించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), ఆటోమేషన్ కారణంగా సాఫ్ట్‌వేర్ కంపెనీల పని విధానాల్లో గణనీయమైన మార్పులు వస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. వ్యాపార కార్యకలాపాలను మరింత సమర్థంగా నిర్వహించడంతోపాటు మారుతున్న సాంకేతిక పరిస్థితులకు అనుగుణంగా సంస్థను తీర్చిదిద్దేందుకు ఈ నిర్ణయాలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!