

బాలీవుడ్ నటి రాధికా ఆప్టే మరోసారి వార్తల్లో నిలిచారు. ఈసారి తన గత తెలుగు సినిమా గురించి చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. హిందీ చిత్రాలతో పాటు తెలుగులోనూ నటించిన ఆమె, నందమూరి బాలకృష్ణ సరసన ‘లెజెండ్’, ‘లయన్’ వంటి సినిమాల్లో కనిపించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఆ తర్వాత తెలుగులో అవకాశాలు తగ్గడంతో బాలీవుడ్‌పైనే దృష్టి పెట్టి వరుస ప్రాజెక్టులతో బిజీగా మారారు. ఇటీవల ‘అక్క’ అనే వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రాధికా, దాని ప్రమోషన్ల సందర్భంగా గతంలో తాను నటించిన ఓ తెలుగు సినిమా గురించి కొన్ని వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం. తనకంటే వయసులో చాలా పెద్దవాడైన నటుడితో రొమాంటిక్ సన్నివేశాల్లో నటించాల్సి వచ్చిందని ఆమె గుర్తుచేసుకున్నారు.
అంతేకాకుండా, సినిమాలో భాగంగా తన పాత్రకు సొంత మామను పెళ్లి చేసుకునే సన్నివేశాలు ఉన్నాయని, ఆ తర్వాత సినిమా మధ్యలోనే తన పాత్రను చంపేశారని రాధికా ఆప్టే పేర్కొన్నట్లు తెలుస్తోంది. అయితే ఆమె నేరుగా సినిమా పేరు లేదా హీరో పేరు ప్రస్తావించలేదు. కానీ ఆమె చెప్పిన వివరాలు బాలకృష్ణతో కలిసి నటించిన ‘లెజెండ్’ సినిమాకు సంబంధించినవేనని పలువురు భావిస్తున్నారు. ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కొందరు నందమూరి అభిమానులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. గతంలో నటించిన సినిమాల గురించి ఇన్నేళ్ల తర్వాత ఆమె చేసిన వ్యాఖ్యలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో రాధికా ఆప్టే కామెంట్స్ ప్రస్తుతం టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారాయి.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!