

ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) 2026-27 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. స్టాండలోన్ ప్రాతిపదికన బ్యాంక్ రూ.23,038 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.20,160 కోట్లతో పోలిస్తే లాభం 14 శాతం పెరిగింది. రెగ్యులేటరీ ఫైలింగ్ ప్రకారం.. ఎస్‌బీఐ మొత్తం ఆదాయం గతేడాది ఇదే సమయంలోని రూ.1,34,979 కోట్ల నుంచి ఈసారి రూ.1,43,796 కోట్లకు చేరింది. వడ్డీ ఆదాయం కూడా రూ.1,19,654 కోట్ల నుంచి రూ.1,32,019 కోట్లకు పెరిగింది.
మరోవైపు, బ్యాంక్ ఆస్తుల నాణ్యత మెరుగుపడింది. సెప్టెంబర్ 30 నాటికి స్థూల నిరర్థక ఆస్తులు గతేడాది నమోదైన 1.73 శాతం నుంచి 1.39 శాతానికి తగ్గాయి. నికర నిరర్థక ఆస్తులు సైతం 0.42 శాతం నుంచి 0.36 శాతానికి పడిపోయాయి. మొండి బకాయిల కోసం కేటాయించిన ప్రొవిజన్లు గతేడాది రూ.4,132 కోట్లుగా ఉండగా.. ఈసారి రూ.2,759 కోట్లకు తగ్గాయి. ఏకీకృత ప్రాతిపదికన ఎస్‌బీఐ గ్రూప్ నికర లాభం 20 శాతం వృద్ధితో రూ.25,361 కోట్లకు చేరింది. గతేడాది ఇదే త్రైమాసికంలో ఈ లాభం రూ.21,137 కోట్లుగా నమోదైంది. గ్రూప్ మొత్తం ఆదాయం కూడా రూ.1.75 లక్షల కోట్ల నుంచి రూ.1.87 లక్షల కోట్లకు పెరిగింది.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!