

ఎన్నికల కంటే ప్రజల ప్రాణాలకే తమ ప్రభుత్వం తొలి ప్రాధాన్యత ఇస్తుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. మురసు తుపాను పరిస్థితులపై నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. ప్రజల సమస్యలను పరిష్కరించి, వారి బాధలను తొలగించగలిగితే ఎన్నికల్లో ఫలితాలు వాటంతట అవే వస్తాయని తాను నమ్ముతానన్నారు. ప్రజలకు సుపరిపాలన అందించడంతో పాటు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సమర్థంగా అమలు చేయడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితులను స్వయంగా పరిశీలించేందుకు బుధవారం మరోసారి క్షేత్రస్థాయి పర్యటన చేపట్టనున్నట్లు వెల్లడించారు. బుడమేరు విషయంలో ఎలాంటి ప్రమాదం లేదని, వదంతులను నమ్మి ప్రజలు ఆందోళన చెందవద్దని సూచించారు.
అర్నబ్, మురసు తుపాన్లతో పాటు ఎల్‌నినో ప్రభావం కూడా రాష్ట్రంపై ఉందని చంద్రబాబు తెలిపారు. ఈ మూడు సమస్యలు ఒకేసారి ఎదురుకావడం బహుశా ఇదే తొలిసారి కావచ్చని అభిప్రాయపడ్డారు. తుపాన్ల ప్రభావంతో అంటువ్యాధులు ప్రబలకుండా ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుంటోందని, ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 27 శాతం లోటు వర్షపాతం ఉందని వివరించారు. సహాయక చర్యల్లో భాగంగా రెస్క్యూ, రిలీఫ్, పునరావాస కార్యక్రమాలపై ప్రభుత్వం ప్రధానంగా దృష్టి సారించిందన్నారు. తుపాన్ల కారణంగా 4,095 గ్రామాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగగా, 548 సబ్‌స్టేషన్లలో సరఫరా నిలిచిపోయిందని ముఖ్యమంత్రి వెల్లడించారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!