

కరోనా తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్, హైబ్రిడ్ వర్క్ విధానాలు ఉద్యోగ రంగంలో విస్తృతంగా ప్రాచుర్యం పొందాయి. ఇప్పుడు వాటికి కొనసాగింపుగా ‘వర్క్ ఫ్రమ్ పార్క్’ అనే కొత్త కాన్సెప్ట్‌ను దుబాయ్ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఫ్రీలాన్సర్లు, ఇంటి నుంచి లేదా హైబ్రిడ్ విధానంలో పనిచేసే ఉద్యోగులు ప్రకృతి ఒడిలో ప్రశాంతంగా విధులు నిర్వహించేందుకు దుబాయ్ మున్సిపాలిటీ ఈ హబ్‌ను ఏర్పాటు చేసింది. అల్ బర్షా పాండ్ పార్క్‌లో అందుబాటులోకి వచ్చిన ఈ సదుపాయంలో వైఫై, పవర్ సాకెట్లు ఏర్పాటు చేశారు. దీంతో పార్క్‌లోని పచ్చదనం మధ్య కూర్చొని ఉద్యోగులు తమ పనులు చేసుకోవచ్చు.
బయటి వాతావరణం, వేడి ఇబ్బంది కలగకుండా పనిచేయాలనుకునేవారి కోసం పార్క్‌లో ప్రత్యేక ఇండోర్ వర్క్‌స్పేస్‌లను కూడా ఏర్పాటు చేశారు. వీటిని వినియోగించుకోవాలంటే రోజుకు 50 యూఏఈ దిర్హమ్‌లు (సుమారు రూ.1,300) చెల్లించి పాస్ తీసుకోవాలి. అయితే, సాధారణ పార్క్ ప్రాంతంలో కూర్చొని పనిచేసేవారికి ఎలాంటి రుసుము ఉండదు. దుబాయ్ మున్సిపాలిటీ, ఫ్లెక్సిబుల్ వర్క్‌స్పేస్ ప్లాట్‌ఫామ్ ‘లెట్స్‌వర్క్’, నిర్మాణ సంస్థ ‘అమనా’ సంయుక్తంగా ఈ ప్రాజెక్టును చేపట్టాయి. సోమవారం నుంచి ఈ హబ్ సేవలు ప్రారంభమయ్యాయి.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!