

పసిఫిక్ మహాసముద్రంలో చోటుచేసుకున్న ఓ ఘటన అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. తుపానులో చిక్కుకుని దాదాపు 5,400 కిలోమీటర్ల మేర సముద్రంలో కొట్టుకుపోయిన ఐదుగురు ప్రయాణికులు మూడు నెలల తర్వాత సజీవంగా బయటపడ్డారు. జులై 30న తొమ్మిది మంది 20 అడుగుల పడవలో మైక్రోనేసియాలోని మురిలో ద్వీపం నుంచి రువో ద్వీపానికి బయల్దేరారు. అయితే, మార్గమధ్యలో తుపానులో చిక్కుకుని గల్లంతయ్యారు. వారు గమ్యస్థానానికి చేరుకోకపోవడంతో అధికారులు గాలింపు చేపట్టారు. పది రోజుల పాటు సుమారు 85,700 చదరపు కిలోమీటర్ల పరిధిలో వెతికినా పడవ ఆచూకీ లభించలేదు. ఈ విషయాన్ని గ్వామ్‌లోని అమెరికా కోస్ట్ గార్డ్ ధ్రువీకరించింది.
ఇటీవల పసిఫిక్ ద్వీప దేశమైన కిరిబాటిలోని ఫానింగ్ ఐలాండ్ సమీపంలో స్థానికులు ఆ పడవను గుర్తించి అందులోని వారిని రక్షించారు. అప్పటికి ఇద్దరు చిన్నారులు సహా ఐదుగురు మాత్రమే ప్రాణాలతో ఉన్నారు. మరో నలుగురు గల్లంతయ్యారు. ఇంతకాలం సముద్రంలో చిక్కుకున్నప్పటికీ ఐదుగురు ప్రాణాలతో బయటపడటం అసాధారణమని అమెరికా కోస్ట్ గార్డ్ పేర్కొంది. తీవ్ర డీహైడ్రేషన్, పోషకాహార లోపంతో బాధపడుతున్న వారికి ప్రస్తుతం చికిత్స అందిస్తున్నట్లు కిరిబాటి వైద్యాధికారులు తెలిపారు. వారు క్రమంగా కోలుకుంటున్నారని వెల్లడించారు. పడవ ఆచూకీ లభించి ఐదుగురు సురక్షితంగా బయటపడటంతో మైక్రోనేసియాలోనూ ఉపశమనం వ్యక్తమైంది.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!