

భారతీయ సినీ చరిత్రలో అత్యంత భారీ ప్రాజెక్ట్‌లలో ఒకటిగా రూపొందుతున్న రామాయణ సినిమా గురించి కొత్త వార్తలు చర్చకు వస్తున్నాయి. ఈ చిత్రాన్ని నితీష్ తివారి దర్శకత్వంలో రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు. ఈ రెండు భాగాలకు కలిపి దాదాపు రూ.4000 కోట్ల భారీ బడ్జెట్ కేటాయించినట్లు సమాచారం. ఈ సినిమాలో రణ్‌బీర్ కపూర్ రాముడిగా, సాయిపల్లవి సీతగా, యష్ రావణుడిగా నటిస్తున్నారు. అలాగే సన్నీడియోల్ హనుమంతుడిగా, రవి దూబే లక్ష్మణుడిగా కనిపించనున్నారు.
ఇటీవల రావణుడి సోదరుడు కుంభకర్ణుడి పాత్ర గురించి ఆసక్తికర సమాచారం బయటకు వచ్చింది. మొదట ఈ పాత్రలో బాబీ డియోల్ నటిస్తారని వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు ఫైజల్ మాలిక్ పేరు వినిపిస్తోంది. పంచాయత్ వెబ్ సిరీస్‌తో మంచి గుర్తింపు పొందిన ఫైజల్ మాలిక్‌ను కుంభకర్ణుడి పాత్రకు ఎంపిక చేసి, ఆయనపై కొన్ని సన్నివేశాల షూటింగ్ కూడా పూర్తయ్యిందని సమాచారం. ఆయన లుక్ కుంభకర్ణుడి పాత్రకు బాగా సరిపోయిందని సినీ వర్గాలు చెబుతున్నాయి.
ఇక ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్‌ను ఈ నెల 27 న శ్రీ రామనవమి సందర్భంగా విడుదల చేసే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఈ చిత్ర తొలి భాగాన్ని ఈ ఏడాది దీపావళికి విడుదల చేయాలని, రెండో భాగాన్ని వచ్చే ఏడాది దీపావళికి రిలీజ్ చేయాలని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!