

మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాజిల్ తన అద్భుతమైన నటనతో ప్రతి సినిమాలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. హీరో పాత్రలకే పరిమితం కాకుండా, కథ నచ్చితే సహాయక పాత్రలోనైనా నటించేందుకు సిద్ధంగా ఉంటారు. పుష్ప సినిమాలో ఎస్పీ భన్వర్ సింగ్ షెకావత్ పాత్రలో ఆయన నటన ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇప్పుడు ఫహద్ మరోసారి తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారని వార్తలు వస్తున్నాయి. ఈసారి ఆయనకి భారీ పారితోషికం ఇవ్వనున్నారనే టాక్ ఫిలిం నగర్లో వైరల్ అవుతోంది.
మన శంకర వరప్రసాద్ గారు సినిమాతో మెగాస్టార్ చిరంజీవి కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ అందించిన దర్శకుడు అనిల్ రావిపూడి, ఇప్పుడు తన కొత్త సినిమాను వెంకటేష్‌తో చేయబోతున్నారు. ఇప్పటికే ఈ కాంబినేషన్లో ఎఫ్2, ఎఫ్3 వంటి హిట్ చిత్రాలు వచ్చాయి. తాజా వార్తల ప్రకారం ఈ సినిమాలో మరో స్టార్ హీరో కూడా ముఖ్యపాత్రలో కనిపించనున్నారు. మొదట తమిళ నటుడు కార్తీని పరిగణలోకి తీసుకున్నా, ఇప్పుడు మలయాళ స్టార్ ఫహద్ ఫాజిల్ ఫైనల్ అయినట్లు తెలుస్తోంది. అయితే ఆయన వెంకీకి విలన్‌గా నటిస్తారా లేదా మరో హీరో పాత్రలోనా అనే విషయంపై స్పష్టత రాలేదు.
ఫహద్ ఫాజిల్ ఈ చిత్రానికి 15 కోట్ల రూపాయల పారితోషికం పొందుతున్నారని టాక్ వినిపిస్తోంది. ఇది నిజమైతే ఆయన పుష్ప సిరీస్‌లో పొందిన మొత్తాన్ని మించిపోతుంది. పుష్ప ది రైజ్ కోసం 3.5 కోట్లు, పుష్ప 2 ది రూల్ కోసం 7.8 కోట్లు అందుకున్నారు. మొత్తంగా 12 కోట్ల కంటే ఎక్కువ కాదు. కానీ ఇప్పుడు వెంకీతో చేసే ఈ సినిమాలో ఫహద్‌కి 15 కోట్లు ఇవ్వడం టాలీవుడ్లో చర్చనీయాంశమైంది. షెకావత్ సార్‌కి తెలుగు రాష్ట్రాల్లో ఉన్న క్రేజ్ దృష్ట్యా నిర్మాతలు ఎలాంటి వెనుకడుగు వేయకుండా భారీ రెమ్యునరేషన్ ఆఫర్ చేసినట్లు సమాచారం.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!