

ప్రధానంగా సినిమా సెలబ్రిటీలు 'ఏ రోటి కాడ ఆ పాట పాడడం' అనే నీతిని చాలా పద్ధతిగా పాటిస్తూ ఉంటారు. ఏ ఊర్లో తమ సినిమా కార్యక్రమం జరిగితే.. ఆ ఊరి గురించి బీభత్సమైన పొగడ్తలు కురిపిస్తారు. ఆ ఊరితో తమ అనుబంధాన్ని గురించి గప్పాలు కొడతారు. రాజకీయ నాయకుల్లో కూడా ఈ వైఖరి కొంత పరిమితంగా ఉంటుంది.
అయితే ఇప్పుడు మంత్రి నారా లోకేష్ సినిమా వాళ్లను మించి మాట్లాడుతున్నారు. మా జీవితాంతం అనంతపురం నేలకు రుణపడి ఉంటాం అని సెలవిస్తున్నారు. ఇందుకు ఆయన చెబుతున్న కారణాలు మాత్రం చాలా తమాషాగా ఉంటున్నాయి. తన మామ బాలకృష్ణను మూడుసార్లు గెలిపించిన గొప్ప నేల అనంతపురం అని లోకేష్ అంటున్నారు. పనిలో పనిగా.. తాత నందమూరి తారక రామారావును సైడ్ లైన్ చేస్తున్నారా? అనే అనుమానం పలువురిలో కలుగుతోంది. నందమూరి బాలకృష్ణను మూడుసార్లు వరుసగా గెలిపించినందుకు.. ఆయన అల్లుడు నారా లోకేష్ మురిసిపోతూ ఉండవచ్చు గాక. కానీ అనంతపురం నేలకు గానీ, హిందూపురం నియోజకవర్గానికి గానీ.. తమ కృతజ్ఞత వెల్లడించాలనుకుంటే ఆ పని ఇంకా గ్రాండ్ గా చేయవచ్చు.
ఎందుకంటే 1983లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఇప్పటిదాకా.. హిందూపురంలో ఒక్కసారి కూడా ఓడిపోలేదు. పైగా ఇప్పుడు బాలయ్యను మూడుసార్లు వరుసగా గెలిపించడం మాత్రమే కాదు.. గతంలో ఎన్టీ రామారావును కూడా ఆ చోటు మూడుసార్లు వరుసగా గెలిపించింది. పార్టీ పెట్టిన తరువాత.. ఇప్పటిదాకా వరుసగా 11 సార్లు తెలుగుదేశమే గెలుస్తూ వస్తోంది. తమ కుటుంబ అనుబంధాన్నే గనుక లోకేష్ నెమరువేసుకోదలచుకుంటే.. తాత హ్యాట్రిక్ ను, పెద్దమామ నందమూరి హరికృష్ణ విజయాన్ని ప్రస్తావించిన తర్వాతే.. మామ బాలకృష్ణ హ్యాట్రిక్ ప్రస్తావన తేవాలి.
కానీ.. లోకేష్.. బాలయ్యను గెలిపించినందుకు అనంతపురం నేలకు మూడుసార్లు రుణపడి ఉంటాం అని చెప్పడాన్ని గమనిస్తే.. తారకరాముని విజయాల్ని పక్కకు మళ్లిస్తున్నారా అనే అనుమానం కలుగుతుంది. అయినా లోకేష్ ప్రకటన పట్ల మరో పెదవివిరుపు వినిపిస్తోంది. భక్త కనకదాస కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించినంందుకు లోకేష్ ఇంతగా చెప్పుకోవాల్సిన పనిలేదని, జిల్లాకు తాము జీవితాంతం రుణపడి ఉంటాం అని మాటల్లో చెప్పే బదులుగా.. కరువు ప్రాంతంగా, వలసలకు అడ్డాగా పేరుతెచ్చుకున్న అనంతపురం జిల్లాను కూడా.. వారు గొప్పగా చెప్పుకుంటున్న విశాఖపట్నం, అమరావతికి దీటుగా అభివృద్ధి చేసినప్పుడు ఈ మాట అంటే బాగుంటుందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!