

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సాయి పల్లవి పేరు మరోసారి క్రేజీ బయోపిక్ ప్రాజెక్ట్‌లతో సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో బయోపిక్‌ల ట్రెండ్ బాగా కొనసాగుతోంది. ఇప్పటికే భారతీయ శాస్త్రీయ సంగీత దిగ్గజం ఎం. ఎస్ సుబ్బలక్ష్మి జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న బయోపిక్‌లో సాయి పల్లవి నటించే అవకాశమున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అదే సమయంలో మరో లెజెండరీ నటి బయోపిక్ కోసం కూడా ఆమె పేరును పరిశీలిస్తున్నట్లు సమాచారం.
1950 – 60 దశకాల్లో హిందీ సినీరంగాన్ని ఏలిన అందాల నటి మధుబాల జీవితాన్ని తెరపైకి తీసుకురావాలని బాలీవుడ్లో చాలా కాలంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ‘వీనస్ ఆఫ్ ఇండియన్ సినిమా’ గా గుర్తింపు పొందిన మధుబాల అందం, నటనతో కోట్లాది అభిమానులను సంపాదించింది. ముఖ్యంగా మొఘల్ ఈ అజామ్ (Mughal-e-Azam) సినిమాలో ఆమె పోషించిన అనార్కలి పాత్ర భారతీయ సినీ చరిత్రలో చిరస్థాయిగా నిలిచింది. ఈ బయోపిక్‌ను సంజయ్ లీలా భన్సాలీ నిర్మించవచ్చని, దర్శకురాలు జస్మీత్ కె. రీన్ తెరకెక్కించవచ్చని టాక్ ఉంది. మధుబాల పాత్రకు సాయి పల్లవి సహజ నటన, క్లాసికల్ గ్రేస్ సరిపోతాయని కొందరు భావిస్తున్నప్పటికీ, ఆమె ఇప్పటికే ఇతర ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉండటం వల్ల ఈ సినిమా చేస్తుందా లేదా అనేది ఇంకా స్పష్టత రాలేదు.
ఇక మరోవైపు ఎం.ఎస్. సుబ్బులక్ష్మి బయోపిక్ కూడా చర్చల్లో ఉంది. ఈ సినిమాను గీతా ఆర్ట్స్ నిర్మించే అవకాశం ఉందని, నిర్మాత బన్నీ వాసు ఈ ప్రాజెక్ట్‌ను ముందుకు తీసుకెళ్తున్నారని టాక్. దర్శకుడిగా గౌతమ్ తిన్ననూరి పేరు వినిపిస్తోంది. ప్రస్తుతం స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయని తెలుస్తోంది. ఇదే సమయంలో సాయి పల్లవి బాలీవుడ్లో నితీష్ తివారీ తెరకెక్కిస్తున్న రామయణ సినిమాలో సీత పాత్రలో నటిస్తోంది. అలాగే ఏక్ దిన్ సినిమాలో జూనైద్ ఖాన్ (Junaid Khan)తో కలిసి నటిస్తోంది. ఈ బయోపిక్‌లపై అధికారిక ప్రకటన ఇంకా రాకపోయినా, సాయి పల్లవి ఈ లెజెండరీ పాత్రల్లో కనిపిస్తుందా అనే ఆసక్తి అభిమానుల్లో పెరుగుతోంది.

.jpg&w=3840&q=75)












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!