

ఇరాన్‌పై అమెరికా ఆంక్షలు మరింత కఠినతరం అవుతున్న నేపథ్యంలో బాగ్దాద్ విమానాశ్రయానికి ఇరాన్ విమానాల రాకపోకలను ఇరాక్ నిలిపివేసింది. బుధవారం అర్ధరాత్రి నుంచి ఈ సస్పెన్షన్ అమల్లోకి రానుంది. ఇరాన్ ఎయిర్‌వేస్ విమానాలను బాగ్దాద్ నుంచి నజఫ్ విమానాశ్రయానికి మళ్లించే అంశంపై ఇరాక్ అధికారులు చర్చలు జరుపుతున్నారు. ఇరాన్ విమానాలకు ఇంధనం, ల్యాండింగ్ సేవలు, టికెట్ విక్రయాలు వంటి సదుపాయాలు కల్పించే విమానాశ్రయాలు, సంస్థలపై ద్వితీయ ఆంక్షలు విధిస్తామని అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్ హెచ్చరించిన నేపథ్యంలో ఇరాక్ ఈ నిర్ణయం తీసుకుంది.
మరోవైపు అమెరికా ఆంక్షల నేపథ్యంలో ఇరాన్ కూడా విమాన సేవల్లో మార్పులు చేసింది. బుధవారం నుంచి టెహ్రాన్ నుంచి బాగ్దాద్, మస్కట్‌కు వెళ్లే విమానాలను రద్దు చేసినట్లు ఇరాన్ పౌర విమానయాన సంస్థను ఉటంకిస్తూ తస్నిమ్ వార్తా సంస్థ తెలిపింది. అయితే ఇస్తాంబుల్ సహా ఇతర అంతర్జాతీయ మార్గాల్లో విమాన సేవలు కొనసాగనున్నాయి. ఒమన్ విమానాశ్రయంలో ఇరాన్ ప్రయాణికులను ప్రస్తుతం అనుమతించడం లేదని ఇరాన్ అధికారులు తెలిపారు. అమెరికా ఆంక్షల కారణంగా ఇరాన్ అంతర్జాతీయ విమాన సంబంధాలపై ఒత్తిడి మరింత పెరుగుతోంది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!