

సరాయ్ బంజారా రైల్వే స్టేషన్ సమీపంలో కర్మభూమి ఎక్స్‌ప్రెస్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. రైలుకు చెందిన నాలుగు బోగీల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమయ్యాయి. అయితే, ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో ప్రయాణికులు, రైల్వే అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. అమృత్‌సర్ నుంచి న్యూ జల్పాయ్‌గురి వెళ్తున్న 12508 నంబర్ కర్మభూమి ఎక్స్‌ప్రెస్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. రైల్వే అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. సరాయ్ బంజారా స్టేషన్ సమీపానికి చేరుకోగానే ఇంజిన్ నుంచి ఐదో బోగీలో తొలుత మంటలు కనిపించాయి.
ఆ తరువాత మంటలు మరో మూడు బోగీలకు వ్యాపించడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించి రైలును నిలిపివేయడంతో ప్రయాణికులంతా సురక్షితంగా కిందికి దిగారు. సమాచారం అందుకున్న రైల్వే అధికారులు, అత్యవసర సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకుని మంటలను ఆర్పేందుకు చర్యలు చేపట్టారు. బోగీల్లో పెద్దఎత్తున మంటలు ఎగసిపడటంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ వ్యాపించింది. షార్ట్ సర్క్యూట్ కారణంగానే అగ్నిప్రమాదం జరిగి ఉండవచ్చని అధికారులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. అయితే, ప్రమాదానికి కచ్చితమైన కారణాన్ని గుర్తించేందుకు దర్యాప్తు కొనసాగుతోంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!