

ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) దర్యాప్తు అధికారాలపై కర్ణాటక హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తన దృష్టికి వచ్చిన ప్రతి అంశంపైనా విచారణ చేపట్టే అధికారం ఆ సంస్థకు లేదని స్పష్టం చేసింది. మనీలాండరింగ్ కేసుల దర్యాప్తులో చట్టబద్ధమైన నిబంధనలను పక్కనపెట్టలేదని పేర్కొంది. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ (PMLA) పరిధిలోకి రాని నేరాలపై ఆ చట్టం కింద దర్యాప్తు చేపట్టకూడదని ఆదేశించింది. కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే కేవై నంజగౌడతో పాటు ఆయనతో సంబంధం ఉన్న పలువురు పిటిషనర్లపై ED చేపట్టిన దర్యాప్తు ప్రక్రియలను జస్టిస్ ఎం.ఐ. అరుణ్ కొట్టివేశారు.
ఆస్తుల జప్తును ధ్రువీకరిస్తూ PMLA అథారిటీ ఇచ్చిన ఉత్తర్వులను కూడా హైకోర్టు రద్దు చేసింది. పిటిషనర్లలో ఒకరి నుంచి స్వాధీనం చేసుకున్న వస్తువులను తిరిగి ఇవ్వాలని ఆదేశించింది. కోలారు, చిక్కబళ్లాపుర జిల్లా సహకార పాల ఉత్పత్తిదారుల యూనియన్ లిమిటెడ్ (కోముల్)లో ఉద్యోగుల నియామకాల్లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై ED దర్యాప్తు చేపట్టింది. ఈ విచారణను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ సందర్భంగా హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. నియామకాల్లో అవకతవకలకు సంబంధించి FIR లేదా అధికారిక క్రిమినల్ కేసు నమోదైనప్పుడే ED దర్యాప్తు చేపట్టే అవకాశం ఉంటుందని పేర్కొంది. మనీలాండరింగ్ ఆరోపణలను సుమోటోగా పరిగణించి విచారణ ప్రారంభించడం సరైన విధానం కాదని స్పష్టం చేసింది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!