

తన మేనల్లుడు, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ బెనర్జీ నివాసంపై బీజేపీ కార్యకర్తలు దాడి చేశారన్న ఆరోపణలను పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్రంగా ఖండించారు. తమకు ఎదురు తిరిగిన వారిపై బుల్డోజర్లను ప్రయోగించడం బీజేపీకు అలవాటుగా మారిందని విమర్శించారు. ఆ పార్టీ దగ్గర ఎన్ని బుల్డోజర్లు ఉంటే అన్నింటినీ తనపైకి పంపాలని సవాల్ చేశారు. ‘‘మీ దగ్గర ఎన్ని బుల్డోజర్లు ఉన్నాయి? రండి.. నేను మీ ముందే నిలబడి ఉన్నాను. నాపై బుల్డోజర్లను నడపండి. మీరెంత ధైర్యవంతులో చూడాలనుకుంటున్నాను’’ అని వ్యాఖ్యానించారు. అభిషేక్ నివాసానికి వెళ్లి ఆయన్ని పరామర్శించిన అనంతరం మమత ఈ వ్యాఖ్యలు చేశారు.
తృణమూల్ కాంగ్రెస్ నేతలపై దాడులకు పాల్పడటమే కాకుండా, కాళీఘాట్ ప్రాంతంలో ఏళ్లుగా నిర్వహిస్తున్న కాళీ పూజలకు కూడా బీజేపీ ఆటంకాలు సృష్టిస్తోందని మమత ఆరోపించారు. పలు ప్రాంతాల్లో పూజల నిర్వహణకు ఇచ్చిన అనుమతులను రద్దు చేశారని, మరికొన్ని చోట్ల ప్రధాన రహదారులపై పూజలు చేసుకునేందుకు అనుమతించారని పేర్కొన్నారు. ఈ మార్పులకు కారణమేంటని ఆమె ప్రశ్నించారు. కాగా, శనివారం తెల్లవారుజామున కాళీఘాట్‌లోని తన నివాసంపై బీజేపీ కార్యకర్తలు రాళ్లు, ఇటుకలతో దాడి చేశారని అభిషేక్ బెనర్జీ ఆరోపించారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!