

అమెరికాలోని నార్త్ కెరొలీనాకు చెందిన జేమ్స్ గేట్స్ అనే వ్యక్తి చాట్‌జీపీటీ మాతృసంస్థ ఓపెన్‌ఏఐపై కేసు వేశారు. తనను హత్య చేసేందుకు భార్య షెరిల్ గేట్స్ కుట్ర పన్నిందని, ఇందుకు చాట్‌జీపీటీ సహకరించిందని ఆయన ఆరోపించారు. స్వీయరక్షణ పేరుతో చాట్‌బాట్ నుంచి సమాచారాన్ని సేకరించి తన హత్యకు ప్రణాళిక రచించిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. తన భర్త తనను హత్య చేసే అవకాశం ఉందన్న భార్య అనుమానాలను చాట్‌జీపీటీ నిజాలుగా చిత్రీకరించిందని, ఆమెను మరింత ప్రోత్సహించిందని జేమ్స్ ఆరోపించారు.
ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం.. జేమ్స్, షెరిల్ దంపతులకు పదేళ్లలోపు వయసున్న ఇద్దరు పిల్లలు ఉన్నారు. పిల్లలను చూసుకుంటూ ఇంటి వద్దే ఉండే షెరిల్‌ను గతేడాది ఉద్యోగం చేయాలని జేమ్స్ కోరారు. దీంతో ఇద్దరి మధ్య విభేదాలు మొదలయ్యాయని, ఈ క్రమంలో షెరిల్ ఇంటి నుంచి వెళ్లిపోయిందని తెలిపారు. ఆ తరువాత తాను అనారోగ్యానికి గురయ్యానని జేమ్స్ పేర్కొన్నారు. కొన్ని రోజుల తరువాత ఇంట్లోని వస్తువులను తీసుకెళ్లేందుకు షెరిల్ తిరిగి వచ్చిందని, ఆ సమయంలో టేబుల్‌పై విషపూరిత పదార్థాల పేర్లతో ఉన్న ఓ చీటీని గమనించానని చెప్పారు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. దర్యాప్తులో భార్య చాట్‌జీపీటీతో చేసిన సంభాషణలు, హత్యకు సంబంధించిన కుట్ర వివరాలు బయటపడ్డాయని ఆయన ఆరోపించారు.
ఈ ఘటనపై స్థానిక పోలీసులు 2025లోనే కేసు నమోదు చేశారు. అయితే, షెరిల్‌కు వ్యతిరేకంగా బలమైన ఆధారాలు లభించకపోవడంతో ఆమెపై ఉన్న హత్యాయత్నం అభియోగాలను తరువాత తొలగించారు. తాజాగా చాట్‌జీపీటీ సంభాషణలకు సంబంధించిన స్క్రీన్‌షాట్లను కోర్టుకు సమర్పిస్తూ జేమ్స్ మరోసారి న్యాయపోరాటం ప్రారంభించారు. భార్యాభర్తల మధ్య వివాదాల గురించి మొదలైన చాటింగ్ క్రమంగా హత్యకు సంబంధించిన చర్చల దిశగా మారుతున్నప్పటికీ చాట్‌బాట్ ఎలాంటి హెచ్చరికలు ఇవ్వలేదని ఆయన ఆరోపించారు. చాట్‌జీపీటీ రూపకల్పనలోని లోపాలే ఈ పరిస్థితికి కారణమని పేర్కొన్నారు. అయితే, జేమ్స్ చేసిన ఆరోపణలను ఓపెన్‌ఏఐ సంస్థ ఖండించింది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!