

తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ప్రభుత్వం మరో వివాదంలో చిక్కుకుంది. కోయంబత్తూరులో ఇటీవల ప్రారంభించిన పెరియార్ అరివులగం లైబ్రరీకి పుస్తకాల కొనుగోళ్లలో భారీగా అవకతవకలు జరిగాయంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఏడు ఎకరాల విస్తీర్ణంలో సుమారు రూ.300 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ ఏడు అంతస్తుల గ్రంథాలయాన్ని సీఎం విజయ్ అక్టోబర్ 16న ప్రారంభించారు. డీఎంకే ప్రభుత్వ హయాంలో ప్రారంభమైన ఈ ప్రాజెక్టు ఇటీవల పూర్తయింది. ద్రవిడ ఉద్యమ నేత పెరియార్ జ్ఞాపకార్థం దీనికి ఆ పేరు పెట్టారు. లక్షకు పైగా పుస్తకాలతో పాటు డిజిటల్ లైబ్రరీ సదుపాయం కూడా ఇందులో ఏర్పాటు చేశారు. అయితే, పుస్తకాల కొనుగోళ్లలో ధరలు, రచయితలు, ప్రచురణకర్తల వివరాలపై రచయిత పెరుమాళ్ మురుగన్ అనుమానాలు వ్యక్తం చేయడంతో వివాదం మొదలైంది.
సుమారు 1,800 పుస్తకాలను అధిక ధరలకు కొనుగోలు చేశారని, కొందరు రచయితలు, ప్రచురణకర్తల వివరాలు అనుమానాస్పదంగా ఉన్నాయని పెరుమాళ్ మురుగన్ ఆరోపించినట్లు తమిళ మీడియా కథనాలు పేర్కొన్నాయి. కొన్ని పుస్తకాలు కృత్రిమ మేధ (ఏఐ) సాయంతో రూపొందించి ఉండొచ్చని, వాటిపై ఉన్న ఐఎస్‌బీఎన్ వివరాల్లోనూ లోపాలున్నాయని ఆయన ప్రశ్నించారు. సాధారణంగా రూ.250 నుంచి రూ.300 ధర ఉండే పుస్తకాలను రూ.1,500 వరకు చెల్లించి కొనుగోలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యవహారంపై అధికార డీఎంకే, టీవీకే పరస్పరం విమర్శలు చేసుకుంటున్నాయి. గత డీఎంకే ప్రభుత్వ హయాంలోనే కొనుగోళ్లు జరిగాయని విజయ్ ప్రభుత్వం చెబుతుండగా, కొత్త ప్రభుత్వమే వాటిని చేపట్టిందని డీఎంకే ఆరోపిస్తోంది. మరోవైపు, ఈ ఆరోపణలపై స్వతంత్ర దర్యాప్తు జరపాలని బీజేపీ నేత అన్నామలై డిమాండ్ చేశారు. పుస్తకాల ఎంపికకు సిఫార్సు చేసిన కమిటీ వివరాలు, కొనుగోళ్లకు అనుసరించిన విధానం, పుస్తకాల ప్రామాణికతను ధ్రువీకరించిన అధికారుల వివరాలను వెల్లడించాలని కోరారు. ఈ వివాదంపై తమిళనాడు ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!