

తిరుపతి జిల్లాలో మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ మంగళవారం ఉదయం 8 గంటలకు ప్రశాంతంగా ప్రారంభమైంది. తిరుపతి నగరపాలక సంస్థతో పాటు పుత్తూరు, వెంకటగిరి, నాయుడుపేట, సూళ్లూరుపేట పురపాలక సంఘాల పరిధిలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రాల్లో ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలకు అనుగుణంగా ఓట్ల లెక్కింపు చేపట్టారు. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ వెల్లడించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ నాయుడుపేట జెడ్పీ హైస్కూల్‌లో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రాన్ని మున్సిపల్ కమిషనర్ ఫజీలుల్లాతో కలిసి పరిశీలించారు. తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు, ఎన్నికల నిబంధనల అమలు, కేంద్రంలో కల్పించిన సౌకర్యాలు, భద్రతా ఏర్పాట్లను తనిఖీ చేశారు. ఓట్ల లెక్కింపు పారదర్శకంగా, ప్రశాంతంగా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా నిర్వహించేందుకు అధికారులు సమన్వయంతో ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయుడుపేట డీఎస్పీ చెంచుబాబు, తహసీల్దార్ చంద్రశేఖర్ రెడ్డి, ఎన్నికల అధికారులు పాల్గొన్నారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!