

దీపావళి సందర్భంగా దిల్లీలో నవంబర్ 7, 8 తేదీల్లో ఉదయం 6 నుంచి 7 గంటల వరకు, రాత్రి 8 నుంచి 10 గంటల వరకు గ్రీన్ క్రాకర్స్ మాత్రమే కాల్చుకోవడానికి సుప్రీంకోర్టు సోమవారం అనుమతిచ్చింది. అయితే, కోర్టు విధించిన ఆంక్షలను ఉల్లంఘిస్తూ దేశ రాజధానిలో అన్ని రకాల బాణసంచా విక్రయిస్తున్నట్లు స్థానిక మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఈ అంశాన్ని మంగళవారం విచారించిన న్యాయస్థానం ఆందోళన వ్యక్తం చేసింది. మీడియాలో ప్రచురితమైన ఓ ఫొటోను ప్రస్తావిస్తూ.. లైసెన్స్ ఉన్నవి, లేనివి, క్యూఆర్ కోడ్ లేని టపాసులు సైతం మార్కెట్లో అందుబాటులో ఉన్నట్లు కథనాలు వస్తున్నాయని పేర్కొంది. ఈ వ్యవహారంపై దృష్టి సారించి, వాస్తవాలను పరిశీలించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
దిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతంలో కాలుష్యాన్ని నియంత్రించేందుకే బాణసంచా వినియోగంపై పరిమితులు విధించినట్లు సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అయితే, క్షేత్రస్థాయిలో ఆదేశాలు సక్రమంగా అమలుకాకపోవడంపై అసహనం వ్యక్తం చేసింది. అన్ని రకాల టపాసుల విక్రయాలు, వినియోగం కొనసాగితే దేశ రాజధానిలో కాలుష్య సమస్య మరింత తీవ్రమయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించింది. మతపరమైన ఆచారాలు, సంప్రదాయాలను పాటించే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుందని పేర్కొన్న న్యాయస్థానం.. ఆ హక్కు రాజ్యాంగం విధించిన పరిమితులను అతిక్రమించకూడదని స్పష్టం చేసింది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!