

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గంలోని గోకాఫసల్వాడ్ గ్రామానికి చెందిన తుప్పుడు లక్ష్మి మస్కట్‌లో చిక్కుకుపోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలవాలనే ఉద్దేశంతో ఫిబ్రవరి 27న ఉద్యోగం కోసం ఆమె మస్కట్‌కు వెళ్లారు. అయితే అక్కడ ఏజెంట్ చెప్పిన పనికి భిన్నమైన పని అప్పగించారని, యజమాని ఆమె పాస్‌పోర్టును తీసుకుని స్వదేశానికి పంపించేందుకు నిరాకరించారని ఆరోపణలు ఉన్నాయి. ఆమెను విదేశాలకు పంపించిన ఏజెంట్ కూడా ఫోన్ కాల్స్‌కు స్పందించకుండా, తిరిగి భారత్‌కు పంపించేందుకు రూ.2 లక్షలు డిమాండ్ చేసినట్లు సమాచారం. వైఫై, సిమ్ కార్డు సేవలు నిలిచిపోవడంతో కుటుంబ సభ్యులను సంప్రదించలేని పరిస్థితి ఏర్పడింది. చివరకు పక్కింటి వారి ఇంటర్నెట్ సాయంతో కుమారుడు రాజును సంప్రదించి తన కష్టాలను వివరించారు.
తల్లి పడుతున్న బాధలను తట్టుకోలేక కుమారుడు రాజు సెప్టెంబర్ 29న బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను కలిసి సహాయం కోరారు. నెల రోజుల్లోనే తల్లిని స్వదేశానికి తీసుకొస్తానని కేటీఆర్ హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం సంబంధిత అధికారులకు లేఖలు రాసి, లక్ష్మి సురక్షితంగా భారత్‌కు తిరిగి వచ్చేందుకు కేటీఆర్ చొరవ తీసుకున్నారు. కుటుంబంతో తిరిగి కలిసిన అనంతరం లక్ష్మి హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌కు వెళ్లి కేటీఆర్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. తమకు ఎవరూ తోడుగా లేని సమయంలో కేటీఆర్ తన కుమారుడికి ఆశ కల్పించారని ఆమె భావోద్వేగంతో గుర్తుచేసుకున్నారు. “కేటీఆర్ అన్న నా కుమారుడికి నెల రోజుల్లో నన్ను ఇంటికి తీసుకొస్తానని మాట ఇచ్చారు. ఆ మాట నిలబెట్టుకుని నన్ను ఇంటికి చేర్చారు. నా కుటుంబానికి ఆయన చేసిన సహాయాన్ని ఎప్పటికీ మర్చిపోలేను. కేటీఆర్ అన్నకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు” అని లక్ష్మి అన్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!