

టెలిగ్రామ్ వ్యవస్థాపకుడు పావెల్ దురోవ్‌కు చెందిన ఓ ప్రత్యేక యూజర్‌నేమ్ ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. అదే @liar. ఈ యూజర్‌నేమ్‌ను కొనుగోలు చేసేందుకు ఓ వ్యక్తి ఏకంగా 10 లక్షల అమెరికన్ డాలర్లు ఆఫర్ చేసినట్లు దురోవ్ వెల్లడించారు. భారత కరెన్సీలో ఈ మొత్తం సుమారు రూ.8–9 కోట్లకు సమానం. ‘Liar’ అంటే తెలుగులో ‘అబద్ధాలకోరు’ అని అర్థం. ఇంత భారీ మొత్తం చెల్లించి అబద్ధాలకోరు అనే పేరును సొంతం చేసుకోవాలనుకునే వ్యక్తిని ఎలా నమ్మాలంటూ దురోవ్ సరదాగా వ్యాఖ్యానించారు. నవంబర్ 24న సోషల్ మీడియాలో ఈ విషయాన్ని వెల్లడించిన ఆయన, ఈ ఆఫర్ నిజమైనదై ఉండాలని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.
అయితే, ఈ ఆఫర్ ఇచ్చిన వ్యక్తి ఎవరనే విషయాన్ని దురోవ్ వెల్లడించలేదు. ఈ యూజర్‌నేమ్ విక్రయం ఖరారైందని కూడా సమాచారం లేదు. టెలిగ్రామ్‌లో ప్రత్యేకమైన యూజర్‌నేమ్‌లను కొనుగోలు చేయడానికి, విక్రయించడానికి ‘ఫ్రాగ్మెంట్’ అనే ప్రత్యేక మార్కెట్‌ప్లేస్ అందుబాటులో ఉంది. TON బ్లాక్‌చెయిన్ సాంకేతికత ఆధారంగా యూజర్‌నేమ్‌లను డిజిటల్ ఆస్తులుగా నమోదు చేసి, ఇతరులకు బదిలీ చేయవచ్చు. చిన్నగా, ప్రత్యేకంగా, సులభంగా గుర్తుంచుకునే పేర్లకు సాధారణంగా ఎక్కువ డిమాండ్ ఉంటుంది. గతంలో @pride యూజర్‌నేమ్‌కు 2.56 లక్షల డాలర్ల ఆఫర్ వచ్చినట్లు కూడా దురోవ్ వెల్లడించారు. తాజాగా @liar పేరుకు భారీ ఆఫర్ రావడంతో టెలిగ్రామ్ యూజర్‌నేమ్‌ల మార్కెట్‌పై మరోసారి ఆసక్తి పెరిగింది.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!