

సికింద్రాబాద్ కంటోన్మెంట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ) పనితీరుపై మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కంటోన్మెంట్ ప్రాంతంలో పారిశుద్ధ్య నిర్వహణ, ఆసుపత్రి సేవలు, కాంట్రాక్టుల కేటాయింపులో సీఈఓ వ్యవహరిస్తున్న తీరుపై ఆయన అభ్యంతరం తెలిపారు. చెత్త సేకరణ కార్మికులు, స్కావెంజర్ల సంఖ్యను తగ్గించడం వల్ల పారిశుద్ధ్య నిర్వహణ దెబ్బతింటోందని, ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. కంటోన్మెంట్ ఆసుపత్రిలో వైద్య పరికరాలు పనిచేయడం లేదని, సిబ్బందిని తొలగించడంతో పాటు వారికి జీతాలు కూడా చెల్లించడం లేదని ఆరోపించారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
చెత్త తొలగింపు వంటి చిన్న టెండర్లను సైతం స్థానిక కాంట్రాక్టర్లకు కాకుండా అలహాబాద్‌కు చెందిన కాంట్రాక్టర్‌కు అప్పగించడంపై ఈటల అభ్యంతరం వ్యక్తం చేశారు. గతంలో ఎల్-1గా నిలిచిన కాంట్రాక్టర్‌ను నిబంధనల పేరుతో తొలగించి, కొత్త కాంట్రాక్టర్‌కు బాధ్యతలు అప్పగించారని ఆరోపించారు. బోర్డు సభ్యులు, ప్రజాప్రతినిధులు పలుమార్లు సూచనలు చేసినా సీఈఓ తీరు మారలేదని విమర్శించారు. అధికారులపై ఫిర్యాదు చేయడం తమకు ఇష్టం లేకపోయినా, ప్రస్తుత పరిస్థితుల్లో అది తప్పనిసరి అయిందన్నారు. సీఈఓ నిర్ణయాలు, పనితీరుపై కేంద్ర రక్షణ మంత్రి, సంబంధిత ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని, అవసరమైతే ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతామని హెచ్చరించారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!