

తెలంగాణలో వాయు కాలుష్య నియంత్రణ, వాయు నాణ్యత మెరుగుదలకు ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్ కమిటీ (AQMC) ఆధ్వర్యంలో సమగ్ర చర్యలు కొనసాగుతున్నాయి. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (CPCB) మార్గదర్శకాలకు అనుగుణంగా చేపడుతున్న కార్యక్రమాలపై అటవీ, పర్యావరణ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, AQMC ఛైర్మన్ అహ్మద్ నదీమ్, TGPCB మెంబర్ సెక్రటరీ, కమిటీ మెంబర్ కన్వీనర్ రవి ఆధ్వర్యంలో సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. PM10 స్థాయిలు, రోడ్ డస్ట్ నియంత్రణ, వాహన కాలుష్యం, పారిశ్రామిక ఉద్గారాలు, వ్యవసాయ అవశేషాల దహనం, పచ్చదనం పెంపు, నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ (NCAP) అమలు తదితర అంశాలను అధికారులు సమీక్షించారు. 2019–20 నుంచి 2025–26 మధ్య హైదరాబాద్‌లో వార్షిక సగటు PM10 స్థాయులు 86 నుంచి 80 µg/m³కు, సంగారెడ్డిలో 87 నుంచి 78 µg/m³కు తగ్గినట్లు సమావేశంలో వెల్లడైంది. 2025–26లో నల్గొండలో PM10 స్థాయి 71 µg/m³గా నమోదైంది. AQI ప్రధానంగా ‘సంతృప్తికర’ నుంచి ‘మితమైన’ కేటగిరీల్లో ఉన్నట్లు అధికారులు తెలిపారు.
వాయు నాణ్యతను నిరంతరం పర్యవేక్షించేందుకు 13 CAAQMS కేంద్రాల ఏర్పాటు, ఎయిర్ క్వాలిటీ డ్యాష్‌బోర్డు, SMS అలర్ట్ వ్యవస్థలను అభివృద్ధి చేస్తున్నారు. బొల్లారం, జీడిమెట్లలో ఇప్పటికే 8 లో కాస్ట్ సెన్సార్లను ఏర్పాటు చేయగా, నిర్మాణ, కూల్చివేత, రీసైక్లింగ్ ప్రాంతాల్లో వాటి వినియోగాన్ని విస్తరిస్తున్నారు. రోడ్ల మెరుగుదల, మెకానికల్ రోడ్ స్వీపింగ్, గ్రీన్ కవర్, మియావాకీ ప్లాంటేషన్లు, ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం, PUC వ్యవస్థ బలోపేతం వంటి చర్యలు కొనసాగుతున్నాయి. GHMC పరిధిలో TGSRTC ప్రస్తుతం 310 ఎలక్ట్రిక్ బస్సులను నడుపుతోంది. నల్గొండ, సంగారెడ్డి ప్రాంతాల్లో కాలుష్య మూలాల శాస్త్రీయ గుర్తింపునకు Source Apportionment Study, రాష్ట్రస్థాయి Emission Inventoryపై కూడా చర్యలు కొనసాగుతున్నాయి. ఇదిలా ఉండగా, స్వచ్ఛ వాయు సర్వేక్షణలో నల్గొండ 16వ వార్డు జాతీయ స్థాయిలో రెండో ర్యాంక్ సాధించి రూ.20 లక్షల పురస్కారం పొందడంపై కమిటీ హర్షం వ్యక్తం చేసింది. రవాణా, మున్సిపల్, ట్రాఫిక్, పరిశ్రమలు, వ్యవసాయం తదితర శాఖల సమన్వయంతో పాటు ప్రజల భాగస్వామ్యంతోనే మెరుగైన వాయు నాణ్యత సాధ్యమని అధికారులు స్పష్టం చేశారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!