

పీజీ మెడికల్ మేనేజ్‌మెంట్ కోటా సీట్లకు కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం పెంచిన యూనివర్సిటీ ఫీజులపై తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. గత రెండు విద్యా సంవత్సరాలతో పోలిస్తే ఫీజులను భారీగా పెంచడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన రిట్ పిటిషన్‌పై విచారణ జరిపిన ధర్మాసనం.. విద్యార్థులకు తాత్కాలిక ఉపశమనం కల్పించేందుకు ప్రాథమికంగా తగిన ఆధారాలు ఉన్నాయని అభిప్రాయపడింది. పెంచిన ఫీజులో సగం మాత్రమే వసూలు చేయాలని నవంబర్ 16న ఆదేశించింది.
ఈ ఉత్తర్వుల ప్రకారం, ఎంక్యూ-1 క్లినికల్ సీట్లకు గతంలో రూ.49,600గా ఉన్న ఫీజును రూ.2 లక్షలకు పెంచగా, హైకోర్టు దానిని రూ.లక్షకు పరిమితం చేసింది. అలాగే ఎంక్యూ-2, ఎంక్యూ-3 క్లినికల్ సీట్లకు గతంలో రూ.69,600గా ఉన్న ఫీజును రూ.3 లక్షలకు పెంచగా, ప్రస్తుతం రూ.1.5 లక్షలు మాత్రమే వసూలు చేయాలని స్పష్టం చేసింది. ఫీజుల పెంపునకు సంబంధించిన వివరాలతో నాలుగు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వం, విశ్వవిద్యాలయాన్ని ఆదేశించింది. ఈ మధ్యంతర ఉత్తర్వులు కేసులో వెలువడే తుది తీర్పునకు లోబడి ఉంటాయని ధర్మాసనం పేర్కొంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!