

రంగారెడ్డి జిల్లా నార్సింగి పరిధిలోని పసిఫికా హిల్‌క్రెస్ట్ హైరైజ్ అపార్ట్‌మెంట్‌లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. అపార్ట్‌మెంట్‌లోని ఓ బ్లాక్ వద్ద ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్రమంగా అవి 12వ అంతస్తు నుంచి 18వ అంతస్తు వరకు వ్యాపించడంతో నివాసితులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ప్రాణభయంతో పలువురు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. దీంతో అపార్ట్‌మెంట్ ప్రాంగణంలో కొద్దిసేపు గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని నాలుగు ఫైరింజన్లతో మంటలను అదుపు చేసేందుకు చర్యలు చేపట్టారు. సిబ్బంది తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అగ్నికీలల తీవ్రతకు ప్రభావిత ప్రాంతంలోని ఫాల్ సీలింగ్ పూర్తిగా కాలిపోయింది. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. అగ్నిప్రమాదానికి దారితీసిన పరిస్థితులపై అధికారులు వివరాలు సేకరిస్తున్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!