

తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. చిత్ర బృందాలు జీవో తీసుకొచ్చినా ఇకపై సింగిల్ స్క్రీన్ థియేటర్లలో టికెట్ ధరలు పెంచబోమని స్పష్టం చేసింది. ఇది ప్రేక్షకులకు ఇస్తున్న భరోసా అని పేర్కొంది. “అంతరించిపోతున్న సినిమా హాళ్లను కాపాడండి” అనే నినాదంతో నిర్వహించిన ప్రెస్మీట్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు ఎగ్జిబిటర్లు పాల్గొన్నారు. సింగిల్ స్క్రీన్ థియేటర్ల మనుగడ కోసం పర్సంటేజీ షేరింగ్ విధానం అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు.
నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ శిరీష్ మాట్లాడుతూ ఎగ్జిబిటర్ల బతుకుదెరువు కోసమే పర్సంటేజీ విధానం కోరుతున్నామని, ఏ నిర్మాతను లేదా సినిమాను లక్ష్యంగా చేసుకోవడం లేదన్నారు. చదలవాడ శ్రీనివాసరావు ఎగ్జిబిటర్లను ఇండస్ట్రీకి బిడ్డలతో పోలుస్తూ నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్ల మధ్య సమన్వయం అవసరమన్నారు. సునీల్ నారంగ్ మాట్లాడుతూ సింగిల్ స్క్రీన్లలో ఆధునిక సౌకర్యాలు కల్పించలేకపోతున్నామని, థియేటర్లు మూతపడితే మొత్తం పరిశ్రమకే నష్టం జరుగుతుందని హెచ్చరించారు. తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ కార్యదర్శి శ్రీధర్ థియేటర్లు బంద్ చేయడం లేదని, పర్సంటేజీ విధానంలో సినిమాలు ప్రదర్శించాలనేదే తమ ఉద్దేశమని స్పష్టం చేశారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!